వెలగపూడి : హీఫర్ అంతర్జాతీయ సంస్థ సహకారంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థల
(ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్) ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి
చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖా మంత్రి
కాకాణి గోవర్ధన రెడ్డి తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్
సచివాలయంలోని తన ఛాంబర్ లో అమెరికా ప్రధాన కార్యాలయంగా పేదరికం, ఆకలి,
పర్యావరణం అంశాలపై పని చేస్తున్న హీఫర్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులతో ఆయన
బేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కు వారు
అందించే సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమానికి నిత్యం ఎంతో కృషి
చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే రైతులు పంటలు పండించడానికి, పండిన పంటను
అమ్ముకొనుటకు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ గా ఏర్పడిన రైతులకు ఆర్థిక
సహాయం అందించబడుతుందని అన్నారు. ఎఫ్ పీ ఓ లతో కలసి రైతుల ఆర్థికాభివృద్ధిలో
హీఫర్ సంస్థ ప్రతినిధుల భాగస్వామ్యం అభినందించదగిందని మంత్రి కొనియాడారు.
రాష్ట్రంలో ముందుగా అత్యంత సామర్థ్యం గల ఎఫ్ పీ ఓ లను గుర్తించి, ఎఫ్ పీ ఓ
లోని సీఈఓ, బోర్డు డైరెక్టర్లు, రైతులకు ఈ సంస్ధ ప్రతినిధులు శిక్షణ, ఆర్థిక
సహాయం అందిస్తారని చెప్పారు. వీరు ఇప్పటికే ఒడిషా, బీహార్ లలో పని చేశారని, మన
రాష్ట్రంలో తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో పని చేస్తున్నారని అన్నారు. ఈ
సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఏపీ ఎఫ్ పీ ఎస్ సీఈఓ శ్రీధర్
రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ అధికారులు సుభాష్ కిరణ్, శ్రీనాథ్ రెడ్డి, హీఫర్
సంస్థ ప్రెసిడెంట్ సీఈఓ సురిత శాండోషం, సంస్థ ప్రతినిధులు తదితరులు
పాల్గొన్నారు.