విజయవాడ : డాక్టర్ వై.ఎస్. ఆర్. ఆరోగ్యశ్రీ పథకం అమలు లో పాత్రికేయులకు
ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారం పొందేందుకు ప్రత్యేక చర్యలు
చేపట్టినట్లు ప్రెస్ అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు తెలిపారు. 104
హెల్ప్ లైన్” లోప్రత్యేకంగా నెంబరు.4 ను ప్రెస్ చేసి జర్నలిస్టులు తమ సమస్యలకు
పరిష్కారం పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ యేర్పాటు ఏప్రిల్ నాటికి అందుబాటులో కి
వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఆమోదం తెలిపిన ఆ సంస్థ సి.ఇ.ఒ. కు ఆయన
కృతజ్ఞతలు తెలిపారు. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్య
నిర్వాహణాధికారి కార్యాలయంలో సి.యి. ఓ యం.యన్.హరేంధిర ప్రసాద్ ను గురువారం
కలిసి చర్చించారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్య
మంత్రి జగన్ మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకం ద్వారా
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందేందుకు
చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాము వివిధ జిల్లాలలో పర్యటించే సందర్భంలో
క్షేత్ర స్థాయి లో ఎదురవుతున్న వివిధ సమస్యల్ని పాత్రికేయులు, పాత్రికేయ
సంఘాలు తమదృష్టికి తేవడం జరుగుతోందని చైర్మన్ పేర్కొన్నారు. పాత్రికేయులు తమ
దృష్టి కి తెచ్చిన పలు సమస్యల్ని సమాచార పౌర సంబంధాల కమీషనర్ టి. విజయకుమార్
రెడ్డి తో సైతం సంప్రదించి పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. ఆసుపత్రుల
ఎంపిక నుంచి, అక్కడ తమకు సమన్వయ పరిచే అధికారి, తదితర సమస్యల్నిగ్రామీణ స్థాయి
విలేకరి సైతం నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వాహణాధికారికి
వివరించి సత్వర పరిష్కారం పొందే విధంగా ప్రత్యేక విధానం అందు బాటులోనికి
రావాలన్నారు. హెల్త్ కార్డు ల ద్వారా వైద్యసేవలు పొందేందుకు ప్రతి జర్నలిస్టు
రూ. 1200 చెల్లిస్తున్నారని, అంతే మొత్తం లో రాష్ట్ర ప్రభత్వం తమ వంతు జమ
చేస్తోందని, సకాలంలో ఈ సౌకర్యాన్ని జర్నలిస్టులు వినియోగించుకోలేక పోతే
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం వుందని ఆయన అభిప్రాయం వ్యక్తం
చేశారు.
వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వాహణాధికారి (సి.యి.ఓ.)
యం.యన్. హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఎదురవుతున్న
సమస్యలన్నింటిని పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రం లోని జిల్లాల పునర్విభజన
వల్ల కొంత జాప్యం అయిన సంగతిని గుర్తించి తగుచర్యలు చేపట్టామని ఆయన చైర్మన్ కు
వివరించారు. జర్నలిస్టులకు ఈ పధకంలో ఎదురయ్యే సమస్యఅప్పటికప్పుడు నేరుగా
తెలియచేసి పరిష్కారం పొందే విధంగా 104 హెల్ప్ లైన్ లో “నెంబరు.4″ను యేర్పాటు
చేయనున్నట్లు ఆయన చైర్మన్ కు వివరించారు. ఇప్పటి వరకు “104 హెల్ప్ లైన్” లో 3
నెంబర్లు నొక్కి, పరిష్కారాలను పొందేందుకు అవకాశం ఉందన్నారు. జర్నలిస్టులకు ఈ
పథకం లో ఎదురయ్యే సమస్యల్ని తమ కార్యాలయ దృష్టి కి తెచ్చి గంటలోపు వ్యవధిలో
పరిష్కారం పొందేందుకు ‘నెంబరు. 4’ ను “104 హెల్ప్ లైన్” లో
పొందుపరుస్తామన్నారు.