16తేదీన, శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి సంస్థ ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఛైర్మన్
మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన
చేసి ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
సంస్థ ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ధన్యజీవి శ్రీ శ్రీరాములు
ప్రాణత్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర
అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు సైతం పణంగా పెట్టిన శ్రీ పొట్టి
శ్రీరాములు కారణజన్ముడని కొనియాడారు. ఆయన త్యాగాన్ని గుర్తించి నెల్లూరు
జిల్లాకు ఆయన పేరు పెట్టడం కూడా జరిగిందన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు
ఏర్పడడానికి ఆయన నాంది పలికారని, ఆయన పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శంగా
నిలిచిందన్నారు.ఆయన ఉద్యోగాన్ని సైతం విడిచి సబర్మతి ఆశ్రమంలో చేరారని, 1942 సంవత్సరంలో
సత్యాగ్రహం, ‘క్విట్ ఇండియా’ ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్షను సైతం
అనుభవించారని తెలిపారు. ఏనాడూ ఆయన పదవులకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం
పోరాడలేదని, హరిజనోద్ధరణకు నిర్విరామంగా కృషి చేసారని పేర్కొన్నారు.
హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని వ్రాసిన అట్టలను మెడకు, వీపుకు తగిలించుకుని
ఆ రోజుల్లో ప్రచారం చేసేవారని తెలిపారు. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర
ప్రాంతం పట్ల వివక్ష చూపిస్తుందని ద్వజమెత్తేవారని, మద్రాసు నగరంపై ఆంధ్రులకు
కూడా హక్కు వున్నదని భావించి పోరాటం చేసారన్నారు. 1952 అక్టోబరు 19వ తేదీన
నిరాహారదీక్షకు పూనుకుని చివరకు 1952 డిసెంబర్ 15వ తేదీన ప్రాణత్యాగం చేశారని
తెలిపారు. ఆయన మరణానంతరం కేవలం 5 రోజులకే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అంగీకారం
జరిగిందని పేర్కొన్నారు.
అనంతరం సంస్థ ఛైర్మన్ ఏ.మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ శ్రీ పొట్టి
శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోయిందని, ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన
బెదరక దీక్ష పూని తన ప్రాణాలు సైతం అర్పించారని తెలిపారు. ఆ రోజుల్లో ఆయన
దీనజనుల కోసం ఎంతో పోరాటం చేసారని పేర్కొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేకంగా
రాష్ట్రం ఉండాలని పోరాటం చేసి ప్రాణాలు అర్పించి అమరజీవిగా మిగిలిపోయారన్నారు.
ఆయన జయంతి వేడుకలు ప్రభుత్వం నిర్వహించడం హర్షించదగినదని పేర్కొన్నారు. సంస్థ
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఓ) కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ఎఫ్.ఏ & సి.ఏ.ఓ.
రాఘవ రెడ్డి, ఓ.ఎస్.డి.(సి&ఎల్) రవి వర్మ, విజిలెన్స్ (ఏ.డి.) శోభామంజరి,
వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఆర్టీసీ హౌస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది
అధిక సంఖ్యలో పాల్గొన్నారు.