విశాఖపట్నం : ‘‘కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా బలమైన యూత్ వింగ్ ఉంది.
యువజన కాంగ్రె్‌సలో నాతోపాటు పనిచేసిన ఎంతోమంది ముఖ్యమంత్రులు, పీసీసీ
అధ్యక్షులు అయ్యారు. రాజీవ్ స్ఫూర్తితో మేమంతా రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన
స్ఫూర్తిని కొనసాగిస్తాం’’ అని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
పేర్కొన్నారు. నగరంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘యువ క్రాంతి’
పేరుతో ఏర్పాటుచేసిన రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ
సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ ‘‘విభిన్న అంశాలపై యువ నాయకులకు శిక్షణ
ఇవ్వనున్నాం. రాజీవ్‌గాంధీ తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగానే ప్రస్తుతం
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థల్లో భారతీయులు అత్యున్నత స్థానంలో ఉన్నారు.
దేశాభివృద్ధికి బాటలు వేసిన రాజీవ్‌గాంధీ చూపించిన మార్గంలోనే మేమంతా
నడుస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 200 మందికిపైగా యూత్
కాంగ్రెస్ నాయకులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. వీరికి అనేక అంశాల్లో
శిక్షణ ఇచ్చి వివిధ విభాగాలు, పార్టీ కార్యక్రమాలకు బాధ్యులుగా నియమిస్తాం’’
అని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మెయ్యప్పన్, రాష్ట్ర యువజన
కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు మాట్లాడారు.