విజయవాడ : వినియోగదారుల హక్కుల పరిరక్షణతో పాటు వినియోగదారుల సమస్యల
పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు,
వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
విజయవాడ జలవనరుల శాఖ కాంపౌండ్ లోని రైతు శిక్షణా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసిన “ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం-2023”
రాష్ట్రస్థాయి వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన ప్రపంచ
వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని ఎంతో మంది
పోరాటాలు, ఉద్యమాల కారణంగా మనకు ఫలించిన వినియోగదారుల హక్కుల చట్టాన్ని
ఉపయోగించుకొని తద్వారా మేలు పొందాలని సూచించారు. వినియోగదారుల ఉద్యమానికి
మూలపురుషుడుగా పేర్గాంచిన అమెరికా దేశానికి చెందిన రాల్ఫ్ నాడార్ పితామహుడిగా
కీర్తిపొందారన్నారు. ఆయన కృషి వల్లే ప్రపంచమంతటా వినియోగదారుల ఉద్యమ సంఘాలు
ఏర్పడ్డాయన్న విషయం గుర్తు చేశారు. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో వినియోగదారుల
హక్కుల చట్టంపై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం
కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. మంత్రిగా తాను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి
నుండి ప్రజలకు ఖచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకు పొందే విధంగా ప్రణాళికాబద్ధంగా
చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకందించే ఎరువుల్లో డీలర్లు చేస్తున్న మోసాలకు
చెక్ పెట్టామన్నారు. రాష్ట్రమంతటా తనిఖీలు నిర్వహించగా ప్రతీ ఎరువుల బస్తాపై
300 నుండి 400 గ్రాముల వరకు తూకం తక్కువగా వస్తుందని గుర్తించి సంబంధిత
డీలర్లపై 390 కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా
వినియోగదారులకు నష్టాలు కలిగేలా వ్యవహరిస్తున్నారన్న నగర, పట్టణ ప్రాంతాల్లోని
మాల్స్ పై తనిఖీలు నిర్వహించి 190 కేసులు నమోదు చేశామన్నారు. పెట్రోల్ బంకులపై
తరుచూ తనిఖీలు చేపట్టడం ద్వారా 180 కేసులు, బంగారం షాపుల్లో వినియోగదారులకు
జరుగుతున్న నష్టాలపై 190 కేసులు నమోదు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు
నిర్వహించి వ్యాపారస్తులను, వినియోగదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం
చేస్తున్నామన్నారు. వ్యాపారస్తులందరూ నిబంధనల మేరకు వ్యాపార లావాదేవీలు
నిర్వహించాలని హెచ్చరించారు. 1986లో ఉన్న వినియోగదారుల చట్టాన్ని సమూల
మార్పులు చేసి 2019లో కొత్త వినియోగదారుల చట్టం తేవడం ద్వారా వినియోగదారుడు
ఆన్ లైన్ తో పాటు రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండైనా వినియోగదారుల కోర్టులో
ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్
రూమ్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండైనా వచ్చిన ఫిర్యాదులను
స్వీకరించడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను ఎప్పటికప్పుడు
మానిటరింగ్ చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్
లోనే పౌర సరఫరాల శాఖలో ఇటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం
శుభపరిణామన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి
పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటును
ప్రశంసించారని, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో కమాండ్ కంట్రోల్ రూమ్ లు
ఏర్పాటు చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల
దినోత్సవాన్ని ఈ సంవత్సరం స్వచ్ఛమైన ఇంధన పరివర్తన ద్వారా వినియోగదారులకు
సాధికారత కల్పించడంపై దృష్టి పెట్టామని ఈ దిశగా రాష్ట్రంలో అవసరమైన అన్ని
చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అనేక
కార్యక్రమాల ద్వారా పౌర సరఫరాల శాఖలో మెరుగైన ఫలితాలు సాధించామని మంత్రి
కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల
వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ సునీల్ చౌదరి మాట్లాడుతూ
వినియోగదారుల హక్కుల పరిరక్షణతో పాటు వినియోగదారులుగా వారు ఎదుర్కొంటున్న
సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో 17 జిల్లా వినియోగదారుల కమిషన్ లు
పనిచేస్తున్నాయన్నారు. అన్యాయం జరిగిందని వచ్చే వినియోగదారులకు కమిషన్ బాసటగా
నిలుస్తుందన్నారు. వినియోగదారులు మోసపోయే కేసుల్లో ఎక్కువగా బ్యాంకులు,
ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినవేనన్నారు. ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఏజెంట్
చెప్పే విషయాలను నమ్మి వినియోగదారులు మోసపోకుండా సంబంధిత వివరాలపై స్పష్టమైన
అవగాహన తెచ్చుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అనేక విధాలుగా మోసపోతున్నారని
తమ దృష్టికి వచ్చిందని, రెరా చట్టం నిబంధనలపై వినియోగదారులు స్పష్టమైన అవగాహన
తెచ్చుకున్నాకే ప్లాట్లు, స్థలాలు కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ
వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచుకున్న రోజు మార్కెట్ లో జరిగే మోసాలను
నివారించవచ్చన్నారు. వినియోగదారుల కోసం ప్రభుత్వం చేసిన చట్టాలు సఫలీకృతం
కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని, మారుతున్న కాలంలో పెరుగుతున్న
ఆకాంక్షలకనుగుణంగా ప్రతి ఒక్కరూ చైతన్యం కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రణాళికా
సంఘం ఉపాధ్యక్షులు మరియు శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ
వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించేందుకు చేస్తున్న మోసాలను ప్రతి
వినియోగదారుడు గుర్తించి జాగరూకతతో వ్యవహరించాలన్నారు. వినియోగదారులను
ఆకట్టుకునేందుకు ఒకటి కొంటే ఒకటి ఉచితం అని వ్యాపారులు చేసే ప్రచారంలో జరిగే
మోసాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మోసాలు
జరుగుతున్నాయని, కొనుగోలు చేసే సమయంలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత
స్థలం ఉందా లేదా నిర్ధారణకు వచ్చినప్పుడే మోసాలు అరికట్టవచ్చన్నారు. ప్రతి
సంవత్సరం నిర్వహించుకుంటున్న వినియోగదారుల దినోత్సవం ద్వారా ప్రజలందరిలో
చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. పౌర సరఫరాల శాఖ
డైరెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే వినియోగదారుల
హక్కులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పాఠశాల విద్యాశాఖ భాగస్వామ్యంతో
వినియోగదారుల హక్కుల చట్టాలను పాఠ్యాంశంగా చేర్చనున్నామన్నారు. వినియోగదారుల
చట్టాన్ని ఉపయోగించి ఎంత మంది ధైర్యంగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారన్న
విషయాన్ని పౌర సరఫరాల శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందన్నారు. ఇందుకోసం
రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి ఫిర్యాదులు అందుకున్న
నిమిషాల్లో తగు చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగం పనిచేస్తుందన్నారు.
ఇప్పటిదాకా 10,000 ఫోన్ కాల్స్ స్వీకరించామని ఆ సమస్యలను పరిష్కరించి
ఎప్పటికప్పుడు తగు సమాచారాన్ని అందించామన్నారు. స్వచ్ఛమైన ఇంధన వనరులను
ఉపయోగించాలని విచక్షణంగా వాడుకోవాలని, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా
ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు. ఇటీవల టర్కీలో భూకంపాలు సంభవించిన
హృదయవిదారకమైన దృశ్యాలను చూశామని గుర్తుచేశారు. సభకు అధ్యక్షత వహించిన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రపంచ వినియోగదారుల హక్కుల
దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
వినియోగదారులకు తగిన న్యాయం అందించడానికి వినియోగదారుల ఫోరంలను ఏర్పాటు చేసి
అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే
లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. లీగల్ మెట్రాలజీ జాయింట్ కమిషనర్
రామకుమార్ మాట్లాడుతూ వినియోగదారులకు అవగాహన కల్పించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా
300 అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి వేబ్రిడ్జ్
ల ఏర్పాటు ద్వారా రైతులు పండించిన పంటను సకాలంలో విక్రయం సులభతరమైందన్నారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కార్యాలయ విజయవాడ అధికారి వినోద్ మాట్లాడుతూ
క్వాలిటీ, క్వాంటిటీ ప్రామాణికంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కార్యాలయం
పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ధృవీకరించిన ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులనే
వినియోగదారులు కొనుగోలు చేయాలని అప్పుడు ఎటువంటి మోసాలకు తావుండదన్నారు.
జాయింట్ కలెక్టర్ నుపూర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్ అవకాశాలను
దెబ్బతీయకుండా ప్రస్తుత తరం యొక్క ఇంధన అవసరాలను అందరికీ అందించడమే సుస్థిర
ఇంధన వినియోగ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్ పర్సన్
తాతినేని పద్మావతి, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్,
ఏపీ రాష్ట్ర బట్రాజ్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కె. గీతాంజలి దేవి, ఏపీ గౌడ్
కార్పొరేషన్ ఛైర్మన్ మధు శివ రామకృష్ణ, విజయవాడ వినియోగదారుల ఫోరం ఛైర్మన్
ఎన్. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.