అమరావతి : నాలుగు సంవత్సరాలు గడవకముందే 98.5 శాతం మేనిఫెస్టోలో చెప్పిన
హామీలన్నీ నెరవేర్చామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా
శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం చర్చ, నాలుగో
బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఈ రోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. మన ప్రభుత్వం
వచ్చి దాదాపు 45 నెలలు కావస్తోంది. ఈ మూడు సంవత్సరాల 9 నెలల కాలంలో మనం ఏం
చేశామన్నది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అమలు చేసిన తర్వాత దేవుడి దయతో
ఈ సభలో నాలుగో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో విషయంలో
పార్టీలు చూపవలిసిన నిబద్ధతకు సంబంధించి మనం తీసుకువచ్చిన గొప్ప మార్పు ఇది.
మామూలుగా మేనిఫెస్టో అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం అన్న
సాంప్రదాయానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ మేనిఫెస్టో అంటే అదొక పవిత్ర గ్రంధం
అని, అదొక భగవద్గీత అని, బైబిల్ అని, ఖురాన్ అని ప్రజలు పెట్టుకున్న ఆశలని,
వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని నిరూపిస్తూ గొప్ప మార్పు
తీసుకువచ్చాం అని అన్నారు.
ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన చూసుకుంటే..
మన ప్రభుత్వంలో కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివరికి ఎవరికి ఓటు
వేశారన్నది కూడా చూడకుండా మంచి చేస్తామని ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో ఆ మాటను
తూచా తప్పకుండా సంక్షేమపథకాలు, అభివృద్ధి పథకాల్లో అమలు చేశామని మనస్ఫూర్తిగా,
సగర్వంగా, సంతోషంగా చెప్పగలుగుతున్నాం. నా వాళ్లు, కానివాళ్లు అని ప్రజలను
విభజించే జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేసి, ఎన్నికల వరకే రాజకీయాలు,
ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ నా వాళ్లే అన్న గొప్ప సందేశాన్ని ఈ నాలుగేళ్ల
కాలంలో ఇవ్వగలిగాం. ఇది కూడా మనం తీసుకొచ్చిన గొప్ప మార్పు అన్నారు.
మంచి జరిగిందని భావిస్తేనే మద్దతివ్వండి
అప్పట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పుకునేవారు. చివరికి
ప్రజలకు మాత్రం ఏం మంచి జరిగింది ? ఏ కుటుంబానికి ఏం మంచి జరిగింది ? అంటే
ఎవరిదగ్గరా సమాధానం ఉండేది కాదు. అటువంటి పరిస్థితిని మన పాలనలో ఇంటింటికి,
మనిషి మనిషికి ఏం మేలు జరిగిందనేది… గడప, గడపకూ వెళ్లి అక్కా మీ కుటుంబానికి
ప్రభుత్వం నుంచి జరిగిన మంచి ఇదీ అని ఏకంగా ప్రింట్ చేసి, వివరాలతో సహా
వారికి చెప్పి మీకు మంచి జరిగిందని మీరు భావిస్తే మనందరి ప్రభుత్వానికి మద్ధతు
పలకండి అని సగర్వంగా మన ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి జరిగిన మంచిని
వివరించగలిగిన గొప్ప స్ధానంలో ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన సాగింది. ఇది
మనందరి ప్రభుత్వానికి ఉన్న నైతికత, నిబద్ధత అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ.
ఎన్నికలప్పుడు కాకుండా ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్లి,
ప్రతి అక్కనూ కలిసి, ప్రతి ఇంటిలోనూ జరిగిన మంచిని చెప్పగలిగే పరిస్థితి ఈ 45
నెలల్లో తేగలిగాం.
ఆర్బీకేలు – విత్తనం నుంచి విక్రయం వరకూ…
మనందరి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన 10,778 రైతు భరోసా
కేంద్రాలు గ్రామస్ధాయిలో కనిపిస్తున్నాయి. ఇందులో విత్తనం నుంచి పంట కొనుగోలు
వరకు ప్రతి సేవలోనూ రైతన్నకు తోడుగా ఉంటూ, రైతన్నను చేయిపట్టుకుని నడిపించే
గొప్ప వ్యవస్ధ గ్రామస్ధాయిలోనే అందుబాటులో ఉంది. ఈ ఆర్బీకేలలో 10778 మంది
అగ్రికల్చర్, హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లు అక్కడ పనిచేస్తూ రైతులకు తోడుగా
ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఆర్బీకేలు కానీ, ఇలాంటి సేవలు కానీ కనిపించే
పరిస్థితి లేదు.
2019 వరకు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. ఈ 45 నెలల
కాలంలో మరో 17 మెడికల్ కాలేజీలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా
నిర్మించబడుతున్నాయి. మనవైద్య ఆరోగ్య రంగం మీద మనం చూపుతున్న శ్రద్ధకు ఇది ఒక
చిన్న నిదర్శనం. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేవలం 6 పోర్టులు ఉంటే… మరో 4
పోర్టులను నిర్మిస్తున్నాయి. మరో 9 పిషింగ్ హార్భర్లు రాబోతున్నాయి.
25 యేళ్ల పాటు కరెంటుకు ఢోకా లేకుండా…
మరో 7వేల మెగావాట్లకు సంబంధించి కేవలం రూ.2.49 లకే మరో 25 సంవత్సరాలపాటు
అందుబాటులో ఉండేటట్టుగా, సంవత్సరానికి 17వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి,
పగటిపూటే అందుబాటులో ఉండేలా ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఏర్పాటు చేసిన
ప్రభుత్వం కూడా మనదే.
అడుగడుగునా అభివృద్ది….
గ్రామం నుంచి రాష్ట్ర రాజధానుల వరకూ అడుగడుగునా కూడా 45 నెలల పాలనలో మార్పు
కనిపిస్తోంది. మీ జగన్ మార్కు కూడా కనిపిస్తోంది. ఈ 45 నెలల పాలనలో ఈ
రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామాన్ని తీసుకున్నా ఆ గ్రామంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న
మార్పులు గమనించవచ్చు. ప్రతి గ్రామంలో మనం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పాటు
చేసిన గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి.
మన ప్రభుత్వ స్కూళ్లు– ఊహకందని మార్పులు
మనబడి నాడు నేడుతో రాష్ట్రంలో దాదాపు 45వేల స్కూళ్లు, కాలేజీలు రూపం
మారుతున్నాయి. ఇవి వచ్చే తరం పిల్లల భవిష్యత్ కోసం మన ప్రభుత్వం
తీసుకువస్తున్న గొప్ప మార్పు.
నవరత్నాల పథకాలను ఒకసారి గమనిస్తే..
తమ పిల్లలను చదవించే తల్లులకు రూ.15వేలు సాయం చేయడం అన్న ఆలోచన గతంలో ఎప్పుడూ
చూసిందీ లేదు. దేశంలో కూడా ఎక్కడా ఏరాష్ట్రంలో లేదు. మన ప్రభుత్వం నాలుగేళ్లలో
ఈ అమ్మఒడి పథకం ద్వారా 48.48 లక్షల తల్లుల చేతుల్లో పెట్టిన మొత్తం రూ.19,674
కోట్లు.
కేవలం పిల్లలను బడికి పంపించమని తల్లలను ప్రోత్సహించాడనికి చేసిన వ్యయం ఇది.
75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలని మంచి మేనమామలా తాపత్రయపడి, చదువుల కోసం
ఆరాటపడుతూ తెచ్చిన గొప్ప పథకం.
ఉద్యోగాల కల్పన దిశగా
ఐదున్నర కోట్ల జనాభాలో ఉన్నవి నాలుగు లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు. మనం వచ్చిన
తర్వాత నాలుగు లక్షలు నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు చేయగలిగాం. సగం ఉద్యోగాలు
పెంచాం. కానీ ఐదున్నర కోట్ల జనాబాలో 6లక్షల ఉద్యోగాలు. పెద్ద, పెద్ద పరిశ్రమలు
మిగిలినవి అన్నీ చూసుకుంటే మరో 15–20 లక్షల ఉద్యోగాలు. ఈ నేపధ్యంలో ఉద్యోగాలు
ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అని గమనిస్తే.. ఎంఎస్ఎంఈ సెక్టారులో ఉన్నాయి. ఒక్కో
ఎంఎస్ఎంఈ సెక్టారు కనీసం 10 మందికి ఉపాధి కల్పిస్తుంది.
చివరగా రెండు మాటలు..
నాకు పరిశ్రమలు ఎంత ముఖ్యమో.. వ్యవసాయం కూడా అంతే ముఖ్యం. నాకు ఐటీ ఎంత
ముఖ్యమో.. చిరు వ్యాపారులు, నా బీసీ, నా ఎస్సీ, కుల వృత్తుల్లో ఉన్న వారు కూడా
అంతే ముఖ్యం. వారు ఎలా బ్రతకగలుగుతున్నారో అన్నది కూడా అంతే ముఖ్యం. నాకు
ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో.. నెల నెలా పెన్షన్లు తీసుకుంటున్న అవ్వాతాతలు
కూడా అంతే ముఖ్యం.
మనందరి ప్రభుత్వం ద్వారా సంక్షేమం, అభివృద్ధి పథకాలు.. డబ్బులందుకుంటున్న
నిరుపేద అక్క చెల్లెమ్మలు, వారి కుటుంబాలు, వారి బాగోగులు కూడా అంతే ముఖ్యమని
చెప్పడానికి.. ఈ సందర్భంగా, ఈ సభ ద్వారా చెప్పడానికి గర్వ పడుతున్నాను. వారి
సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, లింగ వివక్షలేని సాధికారతలు అంతకన్నా
ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇవన్నీ మనసులో పెట్టుకుని..
నా మంత్రి మండలిలో, మన ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవులు, ఆలయ బోర్డులు,
ఏఎంసీలు, స్థానిక సంస్థల్లో.. ఏ దాంట్లో చూసుకున్నా సామాజిక న్యాయంతో పాటు,
రాజకీయ న్యాయం కూడా అంతే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని గర్వపడుతున్నాను. ఆ
పదవుల్లో కనీసం సగం వాటా అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా, సగం వాటా ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనారిటీ కుటుంబ సభ్యులకు నిండు మనసుతో ఇవ్వడం కూడా నాకు అంతే ముఖ్యమని
చెప్పడానికి గర్వ పడుతున్నాను. ఈ దిశగా ప్రతి అడుగు ఒక దీక్షగా వేయగలిగామని ఈ
సందర్భంగా చెప్పడానికి చాలా చాలా సంతోషపడుతున్నాను.
నా ప్రయాణం పేదలతోనే
ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంతకు ముందు ప్రభుత్వాల్లో మనమంతా చూశాం.
గాల్లో మాటలు. ఏం మాట్లాడుతున్నారో.. ఏం చూపిస్తున్నారో.. అర్ధం కాని
పరిస్థితి. గ్రాఫిక్స్ అలాగే ఉండేవి. ఆ మాటలు అలాగే ఉండేవి. అదిగో
మైక్రోసాఫ్ట్ అనేవారు. అదిగో బిల్గేట్స్ అనే వారు. అదిగో బులెట్ ట్రెయిన్
అని.. గొప్ప గొప్ప మాటలు. కానీ నా నడక మాత్రం నేల మీదే. నా ప్రయాణం మాత్రం
సామాన్యులతోనే. నా ప్రయాణం పేదలతోనే. నా యుద్ధం పెత్తందార్లతోనే. నా లక్ష్యం
పేదరిక నిర్మూలన.
కాబట్టే నా ఎకనామిక్స్ వేరే. పేద కుటుంబాలు బలపడితేనే పేద కులాలు బాగుంటాయి.
పేద కులాలు బాగుంటాయి. పేద కుటుంబాలతో పాటు, పేద కులాలను బలపరిస్తేనే, వారికి
అన్ని సాధికారతలు ఇస్తేనే సమాజం బాగుంటుంది. సమాజంలోని అన్ని ప్రాంతాలను
బలపరిస్తేనే రాష్ట్రం బాగుంటుంది. ఇది నేను నమ్మాను. ఆచరించాను. ఫలితాలు కూడా
చూపించాను.
ఇదే నా ఎకనామిక్స్. ఇదే నా పాలిటిక్స్. ఇదే నా తండ్రిని చూసి నేర్చుకున్న
హిస్టరీ. ఇవన్నీ కలిపితేనే మీ జగన్. ఇన్ని విప్లవాత్మక మార్పులు చేసిన
ప్రభుత్వం. ఇంతగా పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం, ఇంతగా ప్రతి ఇంటికి మంచి
చేసిన మనందరి ప్రభుత్వం.. సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం..
వీటన్నింటిని కూడా దైవకార్యంగా భావించి నిబద్ధతతో అడుగులు వేస్తున్న మనందరి
ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ చల్లగా ఉండాలని
కోరుతూ ఈ చర్చను ముగిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.