వెలగపూడి : ఏపీ అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలు గరంగరంగా సాగాయి. సాగునీటి రంగంపై
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటలయుద్ధం చోటు
చేసుకుంది. సాగునీటి రంగంపై ప్రశ్నకు సంబంధించి అచ్చెన్న మాట్లాడుతూ తాను
తప్పు ఫిగర్లు చెపితే మంత్రి దానికి సామాధానం ఇవ్వాలని అన్నారు. సాగునీటిపై
అన్ని ప్రభుత్వాలు దృష్టిపెడతాయని, అయితే ఈ నాలుగేళ్ళు ఈ రంగం పూర్తి
నిర్లక్ష్యానికి గురయ్యిందని తెలిపారు. చంద్రబాబు సీఎంగా సాగునీటికి రూ.68293
కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. 68 ప్రాజెక్టులు డిజైన్ చేశారని.. 23
ప్రాజెక్టులు పూర్తిచేశారని తెలిపారు. 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు 7 లక్షల
ఎకరాలకు స్ధిరీకరణ చేశారన్నారు. ఉత్తరాంధ్రలో ఇఎన్సి నారాయణ రెడ్డి 2014-18
మధ్య 69 వేల ఎకరాలు సాగునీరు అందించారని చెప్పారు. ఈ నాలుగేళ్ళలో రూ.488
కోట్లు ఖర్చు చేసి 11 వేల ఎకరాలకు నీరు అందించారన్నారు. మంత్రి చాలా తెలివిగా
శాతాల్లో చెపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో
మంత్రి అంబటి రాంబాబు అడ్డుతగిలారు. ‘‘నేను మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు
సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రోగ్రస్లో ఉన్న ప్రాజెక్టు
ఏంటి, ఎప్పటికి సమాధానం ఇస్తారు అని అడగాలి’’ అని అన్నారు. వంశధార స్టేజ్ 2
ఫేజ్ 1ను తొందరగా పూర్తిచేయాలని, ఫేజ్ 2లో రూ.870 కోట్లు గతంలో ఖర్చు చేశామని
చెప్పారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై మట్లాడే హక్కు రాజశేఖర రెడ్డి
వారసులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తిచేసి
ఉత్తరాంధ్రలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని మంత్రి అంబటి రాంబాబు
పేర్కొన్నారు.