తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
అమరావతి : అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. పాదయాత్రలో 600 మందే పాల్గొంటామని విచారణ సందర్భంగా అమరావతి రైతులు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మధ్యలో ఎవరైనా వైదొలగితే ఇతరులను అనుమతించాలని కోరారు. మధ్యలో వచ్చే వారి వివరాలను పోలీసులకు అందిస్తామని తెలిపారు. సంఘీభావం తెలిపేవారు పాదయాత్రకు ముందు, వెనుక ఉండేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు నిబంధనలను రైతులు పాటించడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గుర్తింపుకార్డులు చూపాలని మాత్రమే పోలీసులు కోరారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రైతులు గుర్తింపు కార్డులు చూపాలని, పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అమరావతి రైతుల పాదయాత్ర 41వ రోజు నిలిచిపోయిన విషయం తెలిసిందే.