గుంటూరు : ముఖ్యమంత్రి వెఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం కేబినెట్
సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం
తెలిపింది. విశాఖలో నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను విజయంతం చేసిన
వారిని కేబినెట్ అభినందించిందని మంత్రి సీహెచ్ వేణు గోపాలకృష్ణ స్పష్టం
చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న
నిర్ణయాలను ఆయన వివరించారు.ఏప్రిల్ నెలలో పెన్షన్ 3వ తేదీన పంపిణీ చేయాలని
నిర్ణయించామని తెలిపారు. ఏప్రిల్ నెలలో 1వ తేదీన రిజర్వు బ్యాంకు సెలవు, 2
తేదీ ఆదివారం కావటంతో 3 తేదీన పెన్షన్ పంపిణీ చేస్తామని ఆయన వివరించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించిన నేపథ్యంలో చిత్ర
బృందానికి కేబినెట్ అభినందనలు తెలిపిందని ఆయన అన్నారు.షెడ్యూల్ కులాల చట్ట
సవరణ బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. బీసీ స్టేట్ కమిషన్,
ఎస్టీ, మైనారిటీ, మహిళా కమిషన్ ఛైర్మన్ల పదవీకాలాన్ని రెండేళ్లకు కుదింపు
చేస్తూ తీసుకున్న చట్ట సవరణ నిర్ణయానికి ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.
ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనల సవరణకు ఆమోదం లభించిందన్నారు. ఏపీ పబ్లిక్
లైబ్రరీ చట్ట సవరణ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఏపీ ఎడ్యుకేషన్ ఆర్డినెన్సు
ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని అన్నారు. పాఠశాలల్లోని 5వేల 388
మంది నైట్ వాచ్మెన్ల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ పబ్లిక్
సర్వీసెస్ గ్యారెంటీ బిల్లుకు, 2023-27 నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్
ఆమోదించినట్లు వివరించారు.ఏపీ వాటర్ వేస్బిల్కు, అమలాపురం కేంద్రంగా 120
గ్రామాలను అందులో విలీనం చేస్తున్నట్లు, అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా ఈ
నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పోస్టు
భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ చట్ట
సవరణలు ఆమోదం లభించిందన్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 1908 సవరణకు, ఏపీ
ఎక్సైజ్ చట్ట సవరణకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. దేవాలయాల్లో నాయీ
బ్రాహ్మణులను పాలక మండలిలో సభ్యులుగా నియమించే ప్రతిపాదనను ఆమోదించినట్లు
వివరించారు.