వెలగపూడి : ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, జులైలో విశాఖకు తరలి వెళుతున్నామని తెలిపారు.
విశాఖ నుంచే పాలన ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు
అన్నీ వైసీపీనే గెలవాలని స్పష్టం చేశారు. మీ పనితీరును గమనిస్తున్నాను…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ
మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ విశాఖ నుంచే
పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన
పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించడం తెలిసిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు తాజాగా
క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.
కేబినెట్ మంత్రులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లాస్
ఏపీ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ మంత్రులకు సీఎం వైఎస్ జగన్ మోహన్
రెడ్డి క్లాస్ తీసుకున్నారు. మంగళవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక
అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా
గెలవాలని మంత్రులను ఒకింత హెచ్చరించారు. మంత్రులు ఎవరేం చేస్తున్నారో అందరి
పనితీరు గమనిస్తున్నానన్నారు. తేడాలొస్తే మంత్రులను మార్చేస్తానని స్ట్రాంగ్
వార్నింగ్ ఇచ్చారు. కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యతలను
మంత్రులకు సీఎం కట్టబెట్టారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను
ఆయన అప్పగించారు. ఇచ్చిన బాధ్యతలు సరిగ్గా నిర్వహించకపోతే పరిస్థితులు వేరేలా
ఉంటాయని హెచ్చరించారు.
ముగ్గురు మంత్రులకు పదవీ గండం
మంత్రుల తీరు బాగాలేకపోతే ఇద్దరు ముగ్గుర్ని పదవుల నుంచి తప్పించడానికి కూడా ఏ
మాత్రం వెనకాడనని సీఎం తేల్చిచెప్పేసినట్లు సమాచారం. స్వయంగా సీఎం జగనే ఈ
కామెంట్స్ చేయడంతో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో కేబినెట్ నుంచి ఎవర్ని
తొలగిస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతే కాకుండా శాఖాపరంగా,
పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు కూడా ఉంటాయని ఇంకొందరు మంత్రులను జగన్
పరోక్షంగా హెచ్చరించారట. అయితే జగన్ ఎవరెవర్ని మంత్రి పదవుల్లో నుంచి
తొలగిస్తారు? ఎవరెవరి శాఖలు మారుస్తారనే దానిపై వైసీపీ శ్రేణుల్లో టెన్షన్
మొదలైంది. ఆ ముగ్గురిలో ఇద్దరు కోస్తా జిల్లాకు చెందిన వారుకాగా మరొకరు
రాయలసీమకు చెందినవారని తెలుస్తోంది. ఆ ముగ్గురు మంత్రుల స్థానంలో ముగ్గుర్ని
ఎమ్మెల్సీలను కేబినెట్లోకి తీసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ
వర్గాల సమాచారం.