జలజీవన్ మిషన్ ద్వారా కొనసాగుతున్న పనులు
పనుల్లో వేగం పెంచాలి
ఎక్కడా నీటి ఎద్దడి రాకుండా చూడాలి
అధికారులకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం
వెలగపూడి : జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ నివాసిత
ప్రాంతాల్లో రూ.3853 కోట్లతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని, ప్రస్తుత
వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. అవసరమైన
ప్రతి చోటికీ తాగునీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అందించాలని కోరారు. రాష్ట్ర
సచివాలయంలో సోమవారం జలజీవన్ మిషన్ (జేజేఎం) పనుల పురోగతిని మంత్రి నాగార్జున
సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తం మీద 7917
ఎస్సీ నివాసిత ప్రాంతాలు ఉండగా వీటిలో 4852 నివాసిత ప్రాంతాలకు ఇప్పటికే
తాగునీటి వసతులు పూర్తిగా ఉన్నాయని ఈ ప్రాంతాల్లో తలసరి రోజుకు 55 లీటర్ల
చొప్పున నీటిని అందిస్తున్నామని చెప్పారు. మిగిలిన 3065 నివాసిత ప్రాంతాల్లో
పాక్షికంగా నీటి సరఫరా ఉందని తెలిపారు. అయితే అన్ని ప్రాంతాల్లోనూ అవసరమైన
మేరకు తాగు నీటిని అందించడం కోసం ప్రభుత్వం జేఎంఎం పథకాన్ని అమలు చేస్తోందని
వివరించారు. జేజేఎం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీల నివాసిత ప్రాంతాల్లో 8911
పనులకు రూ.1326.55 కోట్లను మంజూరు చేసారని చెప్పారు. జేఎంఎం ప్రాజెక్టుల కింద
9 పనులకు రూ.2048 కోట్లను మంజూరు చేయగా జగనన్న గృహ సముదాయాల్లో ప్రత్యేకంగా
10694 లేఅవుట్లకు రూ.478 కోట్ల చొప్పున మొత్తం 19614 పనులకు రూ.3853 కోట్లను
ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జేజేఎంకు సంబంధించిన 8911 పనుల్లో
3627 పనులు పూర్తికాగా 5284 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జేజేఎం ప్రాజెక్టు
పనులన్నీ పురోగతిలో ఉండగా జగనన్న లేఅవుట్లకు సంబంధించిన పనులలో 1622 పనులు
పురోగతిలో ఉన్నాయని వివరించారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న పనుల వివరాలను
తెలుసుకున్న మంత్రి ఈ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని, జేజేఎం పథకానికి
సంబంధించిన పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ సబ్ ప్లాన్
ద్వారా జేజేఎం పథకానికి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయడానికి కూడా చర్యలు
తీసుకుంటామని, అసెంబ్లీ సమావేశాల అనంతరం నోడల్ ఏజెన్సీ సమావేశాన్ని ఏర్పాటు
చేసి దీనికి అవసరమైన అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ వేసవిలో ఎస్సీ వాడల్లో
ఎక్కడ కూడా తాగు నీటి కొరత తలెత్తకుండా చూడాలని కోరారు. బోర్లు, మోటార్లు,
పైప్ లైన్ల మరమ్మత్తులు అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని వాటిని
పునరుద్ధరించాలని ఆదేశించారు. అవసరమైన ప్రతి ప్రాంతానికీ ట్యాంకర్ల ద్వారా
తాగు నీటిని సరఫరా చేయడానికి కూడా చర్యలు చేపట్టాలని కూడా అధికారులను
ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కాటి హర్షవర్ధన్,
గ్రామీణ నీటి సరఫరా శాఖ(ఆర్.డబ్ల్యు.ఎస్) ఇంజనీర్ ఇన్ చీఫ్
ఆర్.వి.కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.