అమరావతి : ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంపై ఏపీ సీఎం
జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర
బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం
పట్ల గర్వంతో ఉప్పొంగిపోతున్నట్లు జగన్ చెప్పారు. దర్శకుడు రాజమౌళి, నటులు
ఎన్టీఆర్, రామ్చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్,
గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ సహా మొత్తం చిత్ర బృందాన్ని ఆయన
అభినందించారు. తనతో సహా కోట్లాది తెలుగు ప్రజలు, భారతీయులు గర్వపడేలా చేశారని
జగన్ కొనియాడారు. ఆస్కార్ పోటీలో తెలుగువారు ప్రపంచానికి టార్చ్ బేరర్లా
నిలవటం గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 95ఏళ్ల ఆస్కార్ చరిత్ర
లో ‘నాటు నాటు’ పాట చరిత్ర సృష్టించి తెలుగునేలను పులకింపజేసిందని కొనియాడారు.
ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత
చంద్రబోస్ తదితరులకు ఆయన అభినందనలు తెలిపారు. టీమ్ లీడర్ రాజమౌళి అయినా
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ అంతా కలిసి ఓ చరిత్ర
సృష్టించారని చంద్రబాబు కొనియాడారు.