గుంటూరు : కుగ్రామం, నగరం అన్న తేడా లేకుండా ప్రజలందరికీ వారి సొంత ఊళ్లో
ప్రభుత్వ సేవలన్నీ అందుబాటులో తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు
పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ
బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను
ఏర్పాటుచేస్తూ 2022 డిసెంబర్లో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో
బిల్లు ప్రవేశపెట్టి ఆ వ్యవస్థకు పూర్తి చట్టబద్ధతను కల్పించనుంది. ఇప్పుటికే
ఆర్డినెన్స్‌లో పేర్కొన్న వివరాల మేరకు ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లును
గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఈ బిల్లు
అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ముందు ఈ నెల 14న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో
ఆమోదానికి వెళ్లనున్నట్టు అధికారులు వెల్లడించారు.
జగన్ సీఎం అయ్యాక 4 నెలలకే ఈ వ్యవస్థకు శ్రీకారం : జగన్మోహన్రెడ్డి
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే 2019 అక్టోబరు 2వ తేదీ నుంచి రాష్ట్రంలో
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల్లో పనిచేసేందుకు
అప్పటికప్పుడే కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరు చేశారు.
వెంటనే ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవన్నీ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే
ప్రభుత్వం పూర్తిచేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి రెండువేల జనాభాకు
ఒక సచివాలయం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు
కొలువుదీరాయి.
గ్రామ సచివాలయంలోనే ప్రభుత్వ సేవలన్నీ : అంతకుముందు వరకు కనీసం ఒక్క శాశ్వత
ఉద్యోగి కూడా నియామకం జరగని చాలా గ్రామాల్లో కొత్తగా ఏర్పాటైన సచివాలయాల్లో
పది నుంచి 11 మంది వరకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది.
కుగ్రామాలతో సహా ప్రతి చోటా ప్రజలకు తమ గ్రామ సచివాలయంలోనే ప్రభుత్వ సేవలన్నీ
అందేలా ఏర్పాటు చేసింది. 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి
తీసుకొచి్చంది. ప్రతి సచివాలయానికి ఇంటర్నెట్ వసతితోపాటు కంప్యూటర్లు,
ప్రింటర్ల సహా ఇతర ఫర్నిచర్‌ను ప్రభుత్వం అందజేసింది. ఇప్పటివరకు గ్రామ,
వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు వారి సొంత ఊరు దాటాల్సిన అవసరం కూడా లేకుండా
దాదాపు ఏడుకోట్లకు పైగా ప్రభుత్వ సేవలను వినియోగించుకున్నారు.