వెలగపూడి : రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక
సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను 13 వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4
గంటల వరకూ ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయబద్దంగా నిర్వహించేందుకు అన్ని
ఏర్పాట్లను చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మఖేష్ కుమార్ మీనా
తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని నియోజక వర్గాలకు సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారులను
ఎన్నికల పరిశీలకులుగా కూడా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆదివారం
వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో
ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం జరుగబోయే
ఎన్నికలకు సంబందించిన సమాచారాన్ని వివరించారు. రాష్ట్రంలో మూడు పట్టభద్రులు,
రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాలు కలుపుకుని మొత్తం
ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన
తెలిపారు. సోమవారం జరగబోయే ఎన్నికల్లో 3 పట్టభద్రుల స్థానాలకు 108 మంది,
2 ఉపాధ్యాయ స్థానాలకు 20 మంది, 3 స్థానిక సంస్థల స్థానాలకు 11 మంది అభ్యర్థులు
పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగే
ఎన్నికల్లో మొత్తం 10,00,519 పట్టభద్రులైన ఓటర్లు, రెండు ఉపాధ్యాయ స్థానాల
ఎన్నికల్లో 55,842 మంది ఓటర్లు మరియు మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాల
ఎన్నికల్లో 3,059 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన
తెలిపారు.