గుంటూరు : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గత 60 సంవత్సరాలలో చేసిన అప్పులు కన్నా
ఎక్కువగా గత ఐదు సంవత్సరాలలో చేసినాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత
న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో జన
చైతన్య వేదిక ఆధ్వర్యంలో హోటల్ గ్రాండ్ నాగార్జునలో రాజ్యాంగ వ్యవస్థలు –
పరిరక్షణ పై జరిగిన సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి
లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. జస్టిస్ బి.చంద్రకుమార్ ప్రసంగిస్తూ
చట్టసభలలో ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటింగ్ తో చట్టాలు
రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో డబ్బు పాత్ర గణనీయంగా
పెరుగుతుందన్నారు. సమాజ హితం కోరే లక్ష్యాలకు బదులుగా ధన సముపార్జనే ధ్యేయంగా
నేటి పాలకులు పాలిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్న శాసనమండలి
ఎన్నికలలో కూడా ఓటుకు 5వేల రూపాయలు ఇవ్వడాన్ని, తీసుకోవటాన్ని తీవ్రంగా
ఖండించారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రధాన రాజకీయ
పార్టీలు ఓట్లు పొందుతున్నాయన్నారు.
శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ దామాషా ఎన్నికల పద్ధతి అమలు
చేస్తేనే ధన రాజకీయాలు అంతమౌతాయని,ఎన్నికలలో కులం,మతం ప్రభావాలు
తగ్గుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజం,లౌకికవాదానికి
తిలోదకాలిస్తుందన్నారు. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ ఆవిర్బీస్తేనే
ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయగలమన్నారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను
కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర
అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో
పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమౌతుందన్నారు. విద్వేష రాజకీయాలు,విభజన
రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. సమర్ధత కన్నా విధేయతకే ప్రాధాన్యత
నిస్తున్నారని, అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నమౌతున్నాయని, పీఎంఓ,సీఎంఓ లే పాలన
కొనసాగిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి వ్యవస్థ మినహా ఉప ముఖ్యమంత్రులు,
మంత్రులు, శాసనసభ్యులు నామమాత్రంగా మారుతున్నారని వివరించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత రిజిస్ట్రార్ ప్రముఖ న్యాయ కోవిదులు
ప్రో”యన్.రంగయ్య ప్రసంగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాలన్నారు.
ఫెడరల్ స్ఫూర్తిని తగ్గిస్తూ అధ్యక్ష తరహ పాలన వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు
వేస్తుందన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలు
రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే వ్యవహరించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ
విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఏ.ఆర్ సుబ్రహ్మణ్యం, బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు
కొరివి వినయ్ కుమార్, మానవతా చైర్మన్ రమేష్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు
ప్రత్యూష సుబ్బారావు, విఆర్ఓ సంస్థ సెక్రటరి వేళ్లంగిని, అడ్వకేట్స్ నర్రా
శ్రీనివాసులు, రజనీ, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, జన విజ్ఞాన వేదిక
నేత కోట వెంకటేశ్వర రెడ్డి తదితరులు ప్రసంగించారు.