విజయవాడ : కేంద్రంలో గత 8 ఏళ్లుగా జరుగుతున్న ఆర్థిక కుంభకోణాల్లో అతి
పెద్దదిగా పేర్కొనబడిన అదానీ ఆర్థిక అక్రమాలపై జాయింట్ పార్టమెంటరీ
కమిటీని నియమించి విచారణ జరపాలనే డిమాండ్‌తో సోమవారం ఛలో రాజ్‌భవన్
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపిసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు
రుద్రరాజు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో పరిశీలించి నాయకులు,
కార్యకర్తలకు తగిన సూచనలు ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు
మల్లిఖార్జున ఖర్గె ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు క్రిష్టఫర్ తిలక్, మొయ్యప్పన్ సహా
రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొంటారని వివరించారు. కేంద్రంలో
అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల కోసం కాకుండా కొంతమంది కార్పోరేట్ శక్తుల
కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్న విషయం ప్రజలందరూ
గమనిస్తున్నారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో “మోడీ పోతాడు..రాహుల్
వస్తాడు” అనే నినాదంతో ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.