గుంటూరు : రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ ప్రతి కుటుంబానికీ అండగా నిలుస్తోందని, దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ
చేయని విధంగా 98.5% ఎన్నికల వాగ్ధానాలకు అమలు చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. మహానేత దివంగత
ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో
జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు గడిచిందని అన్నారు.
అనుకున్న లక్ష్యాన్ని దాటి అతని కాలంలోనే ప్రజల గుండెల్లో సీఎం జగన్ చోటు
సంసాదించుకున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలు, ఎస్సీలు,
ఎస్టీలు, మైనార్టీలు, ఓసీ నిరుపేదల పార్టీ అని, సామాజిక న్యాయానికి, మహిళల
విద్య, రాజకీయ, ఆర్థిక సాధికారతలకు పెద్దపీట వేసిన పార్టీ అని అన్నారు.
రైతన్నలను, పల్లెసీమలను, నిరుపేదలను అక్కున చేర్చుకొని, వెన్నుదన్నుగా నిలిచే
నాయకుడి సారధ్యంలో నడుస్తున్న పార్టీ అని అన్నారు. అన్నింటినీ మించి
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ భావించి 98.5 శాతం ఎన్నికల
వాగ్దానాల్ని అమలు చేసిన నాయకుడి పార్టీ అని అన్నారు. గ్రామ స్వరాజ్యం నుంచి
జిల్లాల పునర్విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేపట్టి, అన్ని ప్రాంతాలకూ
సమన్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ వైఎస్సార్సీపీ
అని అన్నారు. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతున్న
దార్శనికుడి పార్టీ అని అన్నారు. జీ 20 సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక బొబ్బిలి వీణ బహుమతిగా అందజేయాలనుకోవడం
గొప్ప విషయమని అన్నారు. బొబ్బిలి వీణ తమ చారిత్రక చిహ్నంగా, సంప్రదాయ కర్నాటక
సంగీతానికి గుర్తుగా రాష్ట్ర ప్రజలు గర్విస్తారని అన్నారు. 20 సదస్సు
ప్రతినిధులకు ఆంధ్ర రాష్ట్ర అతిథి సత్కారాలు మధుర స్మృతులుగా నిలిచిపోతాయని
అన్నారు.