అమరావతి : కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీలో
కీలక బాధ్యతలు అప్పజెప్తామన్న బీజేపీ హామీ మేరకు ఆయన చేరికకు సిద్ధమైనట్లు
తెలుస్తోంది. కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో నాలుగు
పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. తండ్రి అమర్నాథ్ రెడ్డి మరణంతో
తొలిసారిగా 1989 ఎన్నికల్లో వయల్‌పాడు(వాల్మీకిపురం) నుంచి తొలిసారి
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లోనూ ఇదే స్థానం నుంచి
నెగ్గారు. వైఎస్సార్‌కు సన్నిహితుడిగా పేరున్న కిరణ్‌కుమార్‌రెడ్డి 2009లో
పీలేరు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.
తెలంగాణ ఉద్యమ సమయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు
చేపట్టారు(2010 నుంచి 2014 వరకు). ఈయన హయాంలోనే మీ సేవా, రాజీవ్ యువకిరణాలు,
ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారు తల్లి, మన బియ్యం, అమ్మ హస్తం, చిత్తూరు జల
పథకం లాంటివి వచ్చాయి. విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా
చేసి ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. కాంగ్రెస్‌కు రాజీనామా
చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు.
ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ 2018లో
తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉండి మౌనంగా
ఉండిపోయారు.
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు : ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ
పార్టీని వీడనున్నారు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ
వస్తున్నారు. తిరిగి ఆయన యాక్టివ్ పొలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్నారు. ఈ
క్రమంలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది.
హైదారాబాద్ కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. ఆయన సమక్షంలోనే కిరణ్
కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో అమిత్
షాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం బీజేపీలో
చేరనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ
నడుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీలో ఏ పదవి ఇస్తారనేది సైతం
ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ బీజేపీ వ్యవహారాలు అప్పగించే అవకాశం ఉందనే
టాక్ కూడా నడుస్తోంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు.