విజయవాడ : రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి వివిధ సంక్షేమ, అభివృద్ధి
పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్య సారధిగా గుర్తింపు
పొందారని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు.
జగనన్న సంక్షేమ క్యాలెండర్ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక,
సామాజిక భరోసానిస్తోందని అన్నారు. సంక్షేమ క్యాలెండర్ అమలులో భాగంగా మార్చి,
ఏప్రిల్ నెలల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ సంక్షేమ,
అభివృద్ధి కార్యక్రమాలు లబ్దిదారులకు అన్ని విధాలుగా తోడ్పాటు
అందించినున్నాయని అన్నారు. మార్చి నెలలో 18న జగనన్న విద్యాదీవెన, 22న ఉత్తమ
వలంటీర్ల ప్రకటన, 23న జగనన్నకు చెబుదాం, 25న వైఎస్సార్ ఆసరా, 31న జగనన్న వసతి
దీవెన పథకాలు, కార్యక్రమాలు అమలు కానున్నాయని అన్నారు. అలాగే ఏప్రిల్ 6న
ఫ్యామిలీ డాక్టర్, ఏప్రిల్ 10న వలంటీర్లకు సన్మానం, ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం
పథకాలు, కార్యక్రమాలు అమలు జరగనున్నట్లు తెలిపారు.
డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేగవంతం : డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దిశగా
రాష్ట్రంలో అడుగులు వేగవంతం అయినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రతి
విద్యార్థికి డిజిటల్ క్లాస్ రూమ్ అందుబాటులోకి తేవడంతో పాటు, ప్రభుత్వ
వ్యవహారాలన్నీ డిజిటల్ విధానంలో జరిగేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి
చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో డిజిటల్ విప్లవం ఊపందుకుందని అన్నారు. విద్యా
రంగంలో సమూల మార్పులు రానున్నాయని స్మార్ట్ క్లాస్ తో పాటు విద్యార్థులకు
ట్యాబ్ లు అందించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ సేవలందించే
వారికి స్మార్ట్ ఫోన్లు అందజేయడం జరిగిందని అన్నారు. డిజిటలైజేషన్ తో
అవినీతికి తావులేకుండా, పూర్తి పారదర్శకంగా ప్రజలకు లబ్ధి చేకూరుతోందని
అన్నారు. ప్రభుత్వం ప్రతి రంగానికి టెక్నాలజీని జోడిస్తూ పూర్తి స్థాయిలో
డిజిటలైజేషన్ కు కృషి చేస్తోందని ఆయన అన్నారు.