అమరావతి :రుణాలను గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
కోరారు. సీఎం అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో
రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఎస్ఎల్బీసీ 222వ
సమావేశంలో గత ఏడాది ఎంతమేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నది ఎస్ఎల్బీసీ
వెల్లడించింది. ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపుగా ఇచ్చామనీ,
మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువ రుణాలు ఇచ్చామని
పేర్కొంది. ప్రాథమిక రంగానికి 2022–23 రుణప్రణాళిక లక్ష్యం రూ. 2,35,680
కోట్లు. ఇచ్చిన రుణాలు రూ. 2,34,442 కోట్లు. 99.47శాతం లక్ష్యాన్ని
చేరుకున్నామని, వ్యవసాయరంగానికి రుణాల లక్ష్యం రూ. 1,64,740 కోట్లు కాగా..
1,72,225 కోట్లు ఇచ్చామని వెల్లడి. 104.54 శాతం చేరుకున్నామని ఎస్ఎల్బీసీ
తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ. 50,100 కోట్లు కాగా, రూ.
53,149 కోట్లు ఇచ్చామని వెల్లడి. 106.09 శాతం మేర రుణాలు ఇచ్చామని,
ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ.
1,63,903 కోట్లు ఇచ్చామని వెల్లడి. దాదాపుగా రెట్టింపు స్థాయిలో 195.59శాతం
మేర రుణాలు ఇచ్చామని వెల్లడించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి
మాట్లాడుతూ 222వ ఎస్ఎల్బీసీ సమావేశం సందర్భంగా, రాష్ట్రంలో బ్యాంకింగ్
వ్యవస్థ విజయాలు సాధించినందుకు సంతోషిస్తున్నాను. నా అభినందనలు కూడా
తెలియజేస్తున్నాను. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే
వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించింది. ఇది 124.69%గా ఉందని
చెప్పడానికి సంతోషకరంగా ఉంది.
30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ప్రభుత్వమే ఈ ఇళ్ల స్ధలాలు సేకరించి,
లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ ఏప్రిల్ నెలలో మరో 3 లక్షల ఇళ్ల
నిర్మాణం ప్రారంభించబోతున్నాం. వీటితో కలిపి దాదాపు 25 లక్షల ఇళ్లు
నిర్మించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా
చేస్తుంది. సిమెంటు, స్టీలు సబ్సిడీ ధరలకు అందిస్తోంది. వీటికి అదనంగా ఇళ్ల
నిర్మాణ లబ్దిదారులకు రూ.35వేలు రుణం 3 శాతం వడ్డీతో అందించాలని బ్యాంకులతో
చర్చించాం. ప్రభుత్వం ఈ రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లిస్తుంది. ఈ ఇళ్ల
లబ్ధిదారులందరూ మహిళలే. వారి పేరు మీద ఇళ్లపట్టాలు ఇచ్చాం.
ఇక వ్యవసాయ రంగం విషయానికొస్తే స్వల్పకాలిక పంట రుణాల విషయంలో
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చూస్తే కేవలం 83.36శాతం మాత్రమే చేరుకున్నాం.
దీనికి సంబంధించిన కారణాలపై దృష్టి పెట్టి ఎస్ఎల్బీసీ సరైన చర్యలు
తీసుకోవాలని కోరుతున్నాను. కౌలు రైతులకు రుణాలకు సంబంధించి డిసెంబర్ 2022
వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించాం. 1,63,811 మంది కౌలు
రైతు ఖాతాలకు మాత్రమే క్రెడిట్‌ను పొడిగించారు. కౌలు రైతుల రుణాల లక్ష్యం రూ.
4,000 కోట్లు కాగా, మొదటి 9 నెలల్లో కేవలం రూ.1,126 కోట్లు మాత్రమే మంజూరు
చేశారు. కౌలు రైతులకు బ్యాంకులు మరింత బాసటగా నిలవాలి.