విశాఖపట్నం : రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి
చూపు ఉత్తరాంధ్ర పైనే ఉంది. ఇక్కడ 37 మంది బరిలో ఉన్నా ప్రధానంగా నలుగురి
మధ్యే పోటీ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలను తలదన్నేలా ప్రధాన పార్టీల
ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారం
అండతో గెలుపు కోసం వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు. విశాఖపట్నం నుంచి
పరిపాలన అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పట్టభద్రుల
ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ నెల 13న జరిగే
ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు
సుధాకర్, టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, బీజేపీ అభ్యర్థి మాధవ్,
ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ మధ్య
ప్రధానంగా పోటీ నెలకొంది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ఓట్లతోపాటు, వీరి ద్వారా ఇతర
ఓట్లు రాబట్టుకునేందుకు వైకాపా అధికారమే అస్త్రంగా ముందుకెళుతోంది. కొందరు
ప్రభుత్వ మెప్పు కోసం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రచారాలు చేస్తున్నారు.
ఏయూ వీసీ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వైకాపా అభ్యర్థి
తరఫున ప్రచారం చేయడం సంచలనమైంది. దీనిపై ఈసీ విచారణకు ఆదేశించిన విషయం
విదితమే. విజయనగరం జిల్లాలో కేజీబీవీ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వైసీపీ
అభ్యర్థిని పరిచయం చేసి, ప్రచారం నిర్వహించిన ఘటనలో సమగ్రశిక్ష పీవోను
సరెండర్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో సచివాలయ సిబ్బంది
కరపత్రాలు చేతబట్టి, వైసీపీ నేతలతో కలిసి ఓ హైస్కూలుకు వెళ్లడం
వివాదాస్పదమైంది. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విశాఖ జిల్లా ఆనందపురం
ఎంఈవోపై కలెక్టర్ వేటు వేశారు.
అనుకూలంగా ఉంటే సరే : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ
గెలుపు కోసం ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వ్యూహాలు
రచిస్తున్నారు. విశాఖలో ఈపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్ తదితరులను ఆయన
కలిశారు. ఇంటర్ బోర్డు ఆర్ఐ, గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్, వివిధ శాఖల
హెచ్వోడీలతోనూ సుబ్బారెడ్డి నేరుగా సెల్ఫోన్లో మాట్లాడుతున్నట్లు సమాచారం.
‘మీకేం కావాలో అది నేను చూసుకుంటా. మీ కింద స్థాయి అధికారులందరితో ఓట్లు పడేలా
చూడండి. మాట వినకపోతే దూరప్రాంతాలకు బదిలీ చేద్దాం’ అని ఆయన అంటున్నట్లు తమ
దృష్టికి వచ్చిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
నంబర్ తీసుకోండి.. ఫోన్ పే చేసేద్దాం : వైసీపీ అభ్యర్థి గెలుపునకు కొందరు
వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సిబ్బంది మూకుమ్మడిగా ఓటర్ల వద్దకు
వెళుతున్నారు. వాలంటీర్ల సాయంతో ఓటర్ల ఫోన్-పే నంబర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు
రాబట్టి నేరుగా నగదు బదిలీ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఏయూ విశ్రాంత
రిజిస్ట్రార్ ఒకరు వైసీపీ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.