విశాఖపట్నం : జి-20 సన్నాహక సదస్సులకు యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా జరగనున్న ఈ సదస్సులకు 48 దేశాల నుంచి 150 మంది వరకు విదేశీ ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ దేశాల రాయబారులు వచ్చే అవకాశం ఉంది. సదస్సు నిర్వహణ, చర్చించే అంశాలు, విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాల వివరాలు రావడంతో అందుకనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్, కాపులుప్పాడ డంపింగ్యార్డ్లోని చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం, పాతనగరంలోని మురుగునీటి శుధ్ధి కేంద్రాలను విదేశీ బృందాలు సందర్శించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జీ-20 సదస్సు నిర్వహణపై యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి జగన్ ఈనెల 28న నగరానికి వచ్చే అవకాశం ఉంది. ఆరోజు రాత్రి అతిథులకు ప్రభుత్వ పరంగా విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, వారసత్వ సంపదలకు సంబంధించిన అంశాలపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అధికారికంగా సీఎం పర్యటన వివరాలు ఇంకా రాలేదు. మౌలిక వసతుల అంశం ఆధారంగా విశాఖలో జి-20 సదస్సు జరుగుతోందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. అతిథులకు వసతి, రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. బీచ్రోడ్డుతో పాటు నగరంలో సుందరీకరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు