విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ
ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని ఎన్నికలో గెలవడానికి శాయశక్తుల
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన ఝలక్ ఇవ్వనుందా?..
నామినేషన్ కార్యక్రమంలో, ప్రచారంలో పాల్గొనకుండా కటీఫ్ సంకేతాలు ఇచ్చిందా?..
అధికారంగా పొత్తు ఉన్నప్పటికీ.. బీజేపీని జనసేన దూరం పెడుతోందా?. ఎమ్మెల్సీ
ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని జనసేన డిసైడ్ అయిందా?.. ఇంతకీ…
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన వ్యూహమేంటి?.. కమలం పార్టీని జనసేన
ఎందుకు దూరం పెడుతోంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.*
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ఎంతో
ప్రతిష్టాత్మంగా తీసుకొని ఎన్నికలో గెలవడానికి శాయశక్తుల కృషి చేస్తున్నాయి.
టీడీపీ నుంచి వేపాడ చిరంజీవరావు, వైసీపీ నుంచి సీతంరాజు సుధాకర్, పీడీఎఫ్
బలపరిచిన రమాప్రభతోపాటు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ బరిలోకి
దిగుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం చిరంజీవరావు, రమాప్రభ మధ్యే ఉంటుందని
టాక్ నడుస్తోంది. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల
కారణంగా ఆ పార్టీని ఓడించాలని పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కసిగా
ఉన్నారు. వారి ఆగ్రహం ఓట్ల రూపంలో మారితే వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా
కష్టమేనన్న గుసగుసలు వినబడుతున్నాయి.
ఆహ్వానించారా? లేదా?, ఆహ్వానించినా హాజరు కాలేదా? : ఇదిలావుంటే ఉత్తరాంద్ర
పట్టభధ్రుల ఎన్నికలు సందర్బంగా జనసేన- బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదని ప్రచారం
జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ఆ పార్టీ తరపున ఉత్తరాంద్ర
పట్టభద్రుల స్థానం నుంచి మళ్లీ గెలవాలని కమలం పార్టీ కలలు కంటోంది. ఎమ్మెల్సీ
ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతోపాటు పట్టణ నేతలు,
కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ.. మిత్రపక్షంగా ఉన్న జనసేన నేతలు పాల్గొన్న
దాఖలాలు ఎక్కడా కనిపించకపోవడం చర్చగా మారుతోంది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల
ప్రచారానికి రావాల్సిందిగా బీజేపీ నేతలు జనసేనను ఆహ్వానించారా? లేదా?..
ఆహ్వానించినా హాజరు కాలేదో కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమంతా కమలం పార్టీ
శ్రేణులతోనే సాగింది. ఎక్కడా జనసేన నేతలు, కార్యకర్తలు కనిపించలేదు. ఆఖరికి..
బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన రోజు కూడా ఆ పార్టీ నేతల హడావుడే
కనిపించింది.
టీడీపీకి ఓటు వేయాలని క్యాడర్ సంకేతాలుకు : బీజేపీపై జనసేన ఆగ్రహానికి చాలా
కారణాలు ఉన్నాయని విశాఖలో టాక్ నడుస్తోంది. జగన్ సర్కార్ ఎన్ని ప్రజావ్యతిరేక
విధానాలు అవలంభిస్తున్నా, ఏపీ బీజేపీ నేతలు బంతిపూలతో యుద్ధం చేయడం జనసేనకు
రుచించడం లేదు. ఏపీని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టివేసినా మూడు రాజధానుల పేరుతో
మూడు ముక్కలాట ఆడుతున్నా, బీజేపీ ఏమాత్రం పట్టించుకోకపోవడంపై జనసేన గుర్రుగా
ఉంది. ఏపీని అన్ని విధాలుగా సర్వనాశనం చేస్తున్నా జగన్ కు బీజేపీ వత్తాసు
పలకడం జనసేనకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. అందుకే ఆ రెండు పార్టీల మధ్య
అధికారికంగా పొత్తున్నా జనసేన బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదని
తెలుస్తోంది.