విజయవాడ : వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించి దేశంలోని అత్యున్నత
అభివృద్ధి బ్యాంకు అయిన నాబార్డ్ వారు 2023-24 సంవత్సరానికి గాను “ఆంధ్ర
ప్రదేశ్ ఋణ ప్రణాళిక సదస్సు” ను గురువారం విజయవాడలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ
పార్క్‌లో నిర్వహించారు. వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి, నాబార్డ్
వారు 2023-24 సంవత్సరానికి గాను రూపొందించిన ₹2.86 లక్షల కోట్ల ఋణ ప్రణాళిక
అంచనా చేయబడ్డ స్టేట్ ఫోకస్ పేపర్‌ను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ప్రభుత్వ
అధికారులు, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్, సీనియర్ బ్యాంక్ అధికారుల సమక్షంలో
విడుదల చేశారు. తగ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి
ఇప్పటికే ఉన్న, కొత్త కార్యకలాపాల క్రింద ఋణ సామర్థ్యాన్ని
అంచనా వేసి నాబార్డ్ వారు, తమ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ప్రతి సంవత్సరం
“స్టేట్ ఫోకస్ పేపర్” ను తయారు చేస్తారని, తద్వారా రాష్ట్రంలో రుణ వితరణను
పెంపొందించడానికి కావలసిన ప్రణాళికలను తయారు చేసుకోవడానికి బ్యాంకర్లకు
యెంతైనా సహాయపడుతుందన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి
ప్రాధాన్యతలను గుర్తించడంలో ప్రభుత్వానికి “స్టేట్ ఫోకస్ పేపర్”
దోహదపడుతుందని కూడా వారు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే, 2022-23లో
ఇప్పటివరకు నాబార్డ్ 28,500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు మరియు బ్యాంకులకు అందించిందని కూడా ఆయన
సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విధి విధానాలకు అనుగుణంగా సుస్థిరమైన,
వేగవంతమైన అభివృద్ధిని సాధించడానికి నాబార్డ్ తమ ఋణ ప్రణాళికను
రూపొందించిందన్నారు. నాబార్డ్ రూపొందించిన 2023-24 సంవత్సరానికి స్టేట్ ఫోకస్
పేపర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యతా రంగాల కింద 2.86 లక్షల కోట్ల రుణాన్ని అంచనా
వేసింది, ఇది 2022-కి అంచనా కంటే 12% పెరుగుదల అని వారు వివరించారు. వ్యవసాయ
రంగానికి ఋణం 1.82 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది, ఇది అన్ని ప్రాధాన్యతా
రంగాల క్రింద గుర్తించబడిన మొత్తం అంచనాల్లో 64%. 1.35 లక్షల కోట్ల పంట రుణాల
క్రింద అంచనా వేయగా వ్యవసాయం, అనుబంధ కార్య కలాపాల కోసం 34,000 కోట్లుగా
అంచనా వేశారు. ఇందులో ప్రధాన భాగాలు పశుపోషణ (15,618 కోట్లు), వ్యవసాయ
యంత్రీకరణ (4,156 కోట్లు), మత్స్య పరిశ్రమ (4,517 కోట్లు) ఉద్యానవనం (3,642
కోట్లు), ఫుడ్ ప్రాసెసింగ్ (4,895 కోట్లు) నిల్వ, మార్కెటింగ్ మౌలిక సదుపాయాల
నిర్మాణం (3,273 కోట్లు). సన్నకారు, చిన్నకారు పరిశ్రమలకై 59,496 కోట్ల
అంచనా వేశారు. ఇతర ప్రాధాన్యతా రంగాల కింద అంచనా వేయబడ్డ 44,476 కొట్లలో,
ప్రధాన భాగాలు గృహ నిర్మాణం (18,502 కోట్లు), ఎగుమతి ఋణం (4,150 కోట్లు)
విద్య (2,839 కోట్లు).