విజయవాడ : దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
గురువారం 64 వ డివిజన్ 285 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక
కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన హాజరయ్యారు. రాజీవ్ నగర్ కట్ట
వెంబడి విస్తృతంగా పర్యటించి 186 గడపలను సందర్శించారు. ప్రతిఒక్కరినీ
పేరుపేరున ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత
అవగాహన కల్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను
అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై మల్లాది విష్ణు ఆరా తీశారు. ఖాళీ
స్థలాలలో పందులు, పాములు చేరకుండా పిచ్చి మొక్కలను తొలగించాలని శానిటేషన్
సిబ్బందిని ఆదేశించారు. వీఎంసీ ఖాళీ స్థలాలను ఫెన్సింగ్ తో పరిరక్షించి
పార్కులుగా మార్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎల్ అండ్ టీ
అసంపూర్తిగా వదిలేసిన రాజీవ్ నగర్ కట్ట ప్రధాన కాల్వ పనులను వేసవి
ముగిసేనాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
సంక్షేమానికి కేరాఫ్ గా జగనన్న సర్కారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలన సంక్షేమానికి కేరాఫ్ గా
నిలిచిందని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 64వ
డివిజన్లో ఇప్పటివరకు 12,302 మంది లబ్ధిదారులకు రూ. 28.96 కోట్ల
లబ్ధిచేకూర్చినట్లు తెలిపారు. సచివాలయ పరిధిలో 2,446 మందికి రూ. 7.40 కోట్ల
సాయాన్ని డీబీటీ ద్వారా నేరుగా వారి వారి వ్యక్తిగత ఖాతాలలో జమ చేశామన్నారు. ఈ
సందర్భంగా లబ్ధిదారు వల్లభనేని ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ సాయంతో కూరగాయల
వ్యాపారాన్ని ప్రారంభించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తొగరపు దుర్గా
మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, సున్నావడ్డీ, ఆసరా పథకాలు
వర్తిస్తున్నట్లు చెప్పారు. నాగమణి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో పింఛన్ల కోసం
వృద్ధులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన వెతలు తప్పాయన్నారు. మరో
లబ్ధిదారు పసుపులేటి శాంతకుమారి మాట్లాడుతూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో తమ
కుటుంబానికి ఆరోగ్య భరోసా లభించిందన్నారు. ఇంటి స్థలం వచ్చిందని, అలాగే
ప్రభుత్వ సాయంతో హోటల్ ను ప్రారంభించి రాణిస్తున్నట్లు పేర్కొన్నారు.
చంద్రబాబుకు సొంత అజెండా, మేనిఫెస్టో అంటూ లేదని మల్లాది విష్ణు విమర్శించారు.
2014 మేనిఫెస్టోను మాయం చేసి.. మరలా అధికారం కోసం 2019 లో వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చరిత్ర చంద్రబాబుది అని ఆరోపించారు. కనుకనే
ఆ ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మల్లాది విష్ణు అన్నారు.
కార్యక్రమంలో నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎస్.కె.ఇస్మాయిల్, జిల్లెల్ల శివ,
మేడా రమేష్, పందిరి వాసు, తాండవ కోటి, వెంకటేశ్వరమ్మ, వడ్డేపల్లి సామ్రాజ్యం,
అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.