విశాఖపట్నం : ప్రభుత్వ హామీలు నెరవేరక పోవడంతో ఉద్యోగులు రాజకీయ పార్టీల
మాదిరిగా ఉద్యమాలు చేయాల్సి రావడం గతంలో ఎప్పుడు చూడలేదని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. లా సన్స్ బే కాలనీ లో గల బీజేపీ
కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులను దొంగ దెబ్బ తీయాలని
చూస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాలను అణిచి వేయాలని
చూస్తుందని, ఉద్యోగుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్ట్యా ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చిందని,
ప్రజల కోసం పని చేసే ఉద్యోగులు డిమాండ్ల విషయములో ప్రభుత్వానికి లొం గి
పోవద్దని సూచించారు. ఉద్యోగుల సర్వీస్ ప్రభుత్వానికే గాని వైసీపీ కి
కాదన్నారు. ఉపాధ్యాయులు బదిలీల కోసం కోర్టుని ఆశ్రయించారని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులంతా డీ ఏ మాట దేవుడెరుగు జీతాలు వస్తె చాలు అన్నట్టుగా
ఉన్నారని, సలహా దారులు మాత్రం సకాలంలో జీతాలు పొందుతున్నారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏమిటి అన్నది శ్వే త
పత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు నుంచి
బీజేపీ శ్రేణులు విజయం దిశగా పని చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును
బీజేపీ కి అనుకూలంగా మార్చుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజల్లో ప్రచారం చేస్తాం అన్నారు. దేవాదాయశాఖ
ను ప్రభుత్వం దేవ ఆదాయ శాఖగా మార్చేశారని ఎద్దేవా చేశారు. అన్నవరం, సింహాచలం,
శ్రీ శైలం దేవస్థానంలకు నిధులు కేంద్రం ఇస్తుందని గుర్తు చేశారు. దేవాలయాలపై
దాడులు చేసిన నిందితులను అరెస్ట్ చేయడం లేదని దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణు కుమార్ రాజు, బీజేపీ విశాఖ పార్లమెంట్
జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర, అనకాపల్లి ఇంఛార్జి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర
కార్యవర్గ సభ్యులు నాగేంద్ర పాల్గొన్నారు.