గుంటూరు : రాష్ట్రంలో వైద్యులు, ఆసుపత్రుల పై దాడులు జరగ కుండా 2008 లో
అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తెచ్చిన ఆంధ్ర ప్రదేశ్ వైద్య
రక్షణ చట్టం కింద రక్షణ కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్
అసోసియేషన్ ప్రతినిధులు డీజీపీ ని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇండియన్
మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్
ఫణిధర్, కోశాధికారి డాక్టర్ రవీంద్ర నాథ్ లు రాష్ట్ర డిజిపి రాజేంద్ర నాథ్
రెడ్డిని మంగళగిరి కార్యాలయంలో కలిసి ఈ చట్టం గురించి రాష్ట్రంలోని అన్ని
పోలీస్ స్టేషన్ లకు తెలుపుతూ సర్క్యులర్ జారీ చేయాలని చేసిన విజ్ఞప్తికి
స్పందిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి సంఘటనలు ఇటీవలి కాలంలో జరగలేదని,
అవసరమైనపుడు వైద్యులు, ఆసుపత్రుల పై భౌతిక దాడులు జరగకుండా తక్షణం రక్షణ
కల్పిస్తామని, దాడులు జరిగితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ
ఇచ్చారు. వెంటనే ప్రస్తుతం ఉన్న చట్టం వివరాలను అన్ని జిల్లాల పోలీస్
అధికారులకు పంపించి , వైద్యులు , ఆసుపత్రుల పై దాడులు జరిగిన పక్షంలో ఈ చట్టం
ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే విధంగా ఆసుపత్రిలో రోగులు మరణించిన సందర్భాలలో రోగుల బంధువులు ఫిర్యాదు
చేసినప్పుడు, వైద్యుల పై కేసులు నమోదు చేసే సమయములో సుప్రీమ్ కోర్ట్ తీర్పులు
పరిగణ లోకి తీసుకోవాలని, ముగ్గురు సభ్యుల వైద్య నిపుణుల కమిటీ ప్రాథమిక
నివేదిక ఆధారంగా కేసుల నమోదు చేయాలని, వైద్యుల ను అరెస్ట్ చేయకుండా సుప్రీమ్
కోర్ట్ ఆదేశాలను అనుసరించాలని ఐ ఎం ఎ నాయకులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా
స్పందించి, వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ వైద్యం అందించి
తమ వంతు ప్రయత్న లోపం లేకుండా నిర్భయంగా తమ వైద్యం అందించాలని కోరారు. ఐ ఎం ఎ
మహిళా విభాగాలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలు, కౌమార బాలికల కోసం
వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, రక్త హీనత నివారణ కార్యక్రమాలు
నిర్వహిస్తున్నారని, స్థానిక పోలీస్ శాఖ సమన్వయంతో మరింత విస్తృతంగా చేయడానికి
అవకాశం వుంటుందని చేసిన విజ్ఞప్తి మేరకు డిజిపి ఇటువంటి సేవా కార్యక్రమాలకు
పోలీస్ శాఖ తప్పని సరిగా సహకారం అందిస్తుందని తెలిపారు. ఐ ఎం ఎ నాయకులు తమ
విజ్ఞప్తి కి సానుకూలంగా స్పందించి నందుకు డి జి పి రాజేంద్ర నాథ్ రెడ్డికి
రాష్ట్ర సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు.