అమరావతి : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం
పార్టీ సిద్ధమవుతోంది. అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తోంది. ఈ విషయంపై
పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 13తో
నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని నిలిపే అంశంపై నేతలతో
చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22
నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు
ఉన్నా వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే
వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే
వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీ కి మద్దతు
ప్రకటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విప్ జారీ
చేయాలని టీడీపీ భావిస్తోంది. ఆయా ఎమ్మెల్యేలు విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి
ఉంటుంది. అందుకే విప్‌ను ఉల్లంఘిస్తే ఆయా ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘానికి
ఫిర్యాదు చేయొచ్చని టీడీపీ భావిస్తోంది.
రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే
షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 13 వరకు నామినేషన్ల
స్వీకరణ, 14న పరిశీలన, 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా కమిషన్
పేర్కొంది. మార్చి 23వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది.
మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్, చల్లా
భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జు నుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్,
పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న
ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మరోవైపు
అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు స్థానిక
సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో 4..
పశ్చిమగోదావరిలో రెండు స్థానాలు, శ్రీకాకు ళం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ
అభ్యర్థులకు పోటీగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈ స్థానాలకు మార్చి 13న
ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో
పి.రామసుబ్బారెడ్డి(వైసీపీ) ఏక గ్రీవం అయ్యారు. అలాగే, ఉమ్మడి తూర్పుగోదావరి
జి ల్లా స్థానిక సంస్థల కోటాలో కుడుపూడి సూర్యనారాయణ(వైసీపీ) ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు.