మచిలీపట్నం : మచిలీపట్నం లో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ
ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుంది.
రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు పవన్
కళ్యాణ్ ప్రకటించనున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల
మనోహర్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం
పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి
సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్
మాట్లాడుతూ “రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆవిర్భావ సభ
జరగనుంది. ఇప్పటికే సభ నిర్వహించుకునేందుకు 34 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా
ఇచ్చారు. దానికి అదనంగా మరో 60 ఎకరాల భూమినీ సభ అవసరాల నిమిత్తం ఇచ్చేందుకు
రైతులు ముందుకు రావడం అనందంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో
ఏర్పాట్లు చేయబోతున్నాం. లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నాం. దీనికి
అనుగుణంగా ఏర్పాట్లు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో
ఒక మార్పు తీసుకొచ్చేందుకు ఈ సభ ఒక పునాది కానుంది. జనసేన రాజకీయ పోరాటం మీద
అధ్యక్షుల వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే రాష్ట్ర ప్రజల
భవిత, రాష్ట్ర గతి మెరుగుపడాలంటే ఎం చేయాలో కూడా ఆయన చెబుతారన్నారు.
ప్రత్యేక కమిటీలు : పార్టీ సభ స్థలం జాతీయ రహదారికి పక్కనే ఉంది. రాకపోకలకు
ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. ముఖ్యంగా సభ నిర్వహణ కోసం
నియోజకవర్గానికి ఇద్దరూ చొప్పున సమన్వయకర్తలను వేస్తున్నాం. వారికీ అదనంగా మరో
సంయుక్త సమన్వయకర్త ఉంటారు. అలాగే వివిధ విభాగాల పర్యవేక్షణ నిమిత్తం కమిటీలు
వేసుకుని చక్కగా కార్యక్రమం నిర్వహించేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి”
అన్నారు. సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అద్యక్షుడు బండ్రెడ్డి
రామకృష్ణ, మచిలీపట్నం ఇంచార్జి బండి రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి
అక్కల గాంధీ, రాష్ట్ర కార్యదర్శి అమ్మిసెట్టి వాసు, కార్యక్రమాల నిర్వహణ
కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు మార్గం…సభాస్థలి వరకు పరిశీలన : మచిలీపట్నం సభాస్థలి పరిశీలనకు
బుధవారం మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన నాదెండ్ల మనోహర్
గారు విజయవాడ నుంచి మచిలీపట్నం సభాస్థలి వరకూ ఉన్న మార్గాన్ని పరిశీలించారు.
14వ తేదీన పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి మచిలీపట్నం సభ
వేదికకు వారాహి వాహనంతో రానుండటంతో ఏ ప్రాంతాల్లో తగిన విధంగా ఏర్పాట్లు
చేస్తే బాగుంటుంది అనే విషయాలు పరిశీలించారు.