విజయవాడ : మహిళలకు అన్ని రంగాల్లో సగం కంటే ఎక్కువ అవకాశాలు ముఖ్యమంత్రి జగన్
మోహన రెడ్డి అందించారని ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ కొమ్మినేని శ్రీనివాస రావు
అన్నారు. స్థానిక ప్రెస్ అకాడమీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని
పురస్కరించుకుని సమాచార పౌర సంబంధాల కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి తో కలిసి
మహిళా జర్నలిస్టుల్ని ఆయన సత్కరించారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో
మహిళలకు 50 శాతానికి మించి అవకాశం కల్పించి చరిత్రలో నిలిచి పోయారన్నారు.
మహిళా సాధికారిత సాధనలో ఇదొక ముందడుగని ఆయన కొనియాడారు. జర్నలిజం రంగంలో
విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ మహిళా జర్నలిస్టుల కృషి కొనసాగిస్తున్నారని,
వారిని ప్రోత్సహించే దిశ గా ప్రెస్ అకాడమి అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
త్వరలోనే జర్నలిస్టులకోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించేందుకు అన్ని
చర్యల్ని తీసుకుంటున్నామన్నారు. నిత్యం జర్నలిస్టుల ఎదుర్కొనే మానసిక
ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఇటీవలే ఒక సదస్సు నిర్వహించామన్నారు. ఇటువంటి
సదస్సులలో ఎక్కువ మంది పాత్రికేయులు పాల్గొని ప్రయోజనం పొందాలని ఆయన
సూచించారు. సమాచార పౌర సంబంధాల కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ
అక్రిడిటేషన్ల దరఖాస్తుల్లోని సమాచారం ఆధారంగా రాష్ట్ర స్థాయిలో మహిళా
జర్నలిస్టుల ఫోరమ్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా జర్నలిస్టుల సమస్యలు, వాటి
పరిష్కారాలకు ఈ వేదిక చక్కని పరిష్కారమౌతుందన్నారు. ఇప్పటికే, అక్రిడిటేషన్
కమిటీల్లో 50 శాతం మహిళా జర్నలిస్టులుండే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మహిళా
జర్నలిస్టుల సమస్యలపై మెరుగైన సలహాలు, సూచనలు ఇస్తే, ప్రభుత్వ దృష్టి కి
తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్,
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను మరింత మెరుగ్గాఅందించేందుకు చర్యలు
చేపట్టామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు సేవలు అందేందుకు
ఆరోగ్యశ్రీ పథకంలో తగు మార్పులు చేపట్టి, ఆన్ లైన్ విధానాన్ని మెరుగు
పరిచామన్నారు. మహిళలను కుటుంబ కేంద్ర బిందువుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం పలు
కార్యక్రమాల్ని అమలుచేస్తోందన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు
ప్రాముఖ్యత పెరిగిందని, ముప్పాతిక భాగం పైగా పథకాలన్నీ మహిళల పేరున
అమలౌతున్నాయన్నారు.
ప్రెస్ అకాడమీ సెక్రెటరీ ఎం. బాల గంగాధర్ తిలక్ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల
కృషి వెల కట్టలేనిదని కొనియాడారు. వారిని ప్రోత్సహించే క్రమంలోభాగంగా ప్రెస్
అకాడమి కార్యక్రమాల్ని చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు
రూపొందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం
శాఖ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు జి. అనిత, సాధారణ పరిపాలన శాఖ (ఐ.&పి.ఆర్)
సెక్షన్ అధికారిణి హేమలత లను శాలువాతో సత్కరించి జ్ఞాపికను కమీషనర్ టి.
విజయకుమార్ రెడ్డి అందచేశారు.