వెలగపూడి : జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యతనివ్వకపోతే దేశ, సమాజం
పురోగతి సాధించలేవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్
ప్రశాంత్‌కుమార్ మిశ్రా అన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తే ప్రపంచంలో
భారతదేశం తిరుగులేని స్థానం సంపాదిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి,
గవర్నర్లుగా, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలుగా పలువురు మహిళలు ఉన్నారని,
అయినప్పటికీ ఉన్నత పదవుల్లో మహిళల సంఖ్య మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని
చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు
న్యాయవాదుల సంఘం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజే ప్రశాంత్‌కుమార్
మిశ్రా, మహిళా న్యాయమూర్తులు జస్టిస్ బి.శ్రీభానుమతి, జస్టిస్ వడ్డిబోయన
సుజాత, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు
కె.జానకిరామిరెడ్డి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్
చైర్మన్ గంటా రామారావు, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి
నాగిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్, పలువురు
న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీజే జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ మహిళలను పూజించడం, గౌరవించడం మన
ధర్మమని చెప్పారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని, అప్పుడే ఉన్నత
శిఖరాలకు చేరుకోగలరని తెలిపారు. ఏపీ హైకోర్టులో గతంలో మహిళా న్యాయవాదుల సంఖ్య
చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు 28 శాతానికి పైగా మహిళలే ఉన్నారన్నారు.
న్యాయవ్యవస్థతోపాటు ఇతర శాఖల్లో నిర్వహించే నియామక పరీక్షల్లో మహిళలే ఎక్కువగా
ఉత్తీర్ణత సాధిస్తున్నారని చెప్పారు.
ఆత్మస్థైర్యం కోల్పోకూడదు : మహిళా న్యాయమూర్తులు జస్టిస్ శ్రీభానుమతి,
జస్టిస్ సుజాత, జస్టిస్ జ్యోతిర్మయి మాట్లాడుతూ హైకోర్టులో మహిళా జడ్జిల
సంఖ్య మరింత పెరగాల్సి ఉందన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఉన్న
అడ్డంకులను మహిళలు తమకు తామే తొలగించుకోవాలన్నారు. మహిళలు ఎన్నడూ
ఆత్మస్థైర్యం కోల్పోకూడదని, తమను తాము తక్కువగా భావించకూడదని తెలిపారు. కేవలం
వాయిదాలు అడిగేందుకే కాకుండా వాదనలు వినిపించే అవకాశాలను మహిళా న్యాయవాదులు
అందిపుచ్చుకోవాలన్నారు. సీనియర్ న్యాయవాది భాస్కరలక్ష్మి మాట్లాడుతూ మహిళా
సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు పురుషులను సైతం ఆహ్వానించాలని, తద్వారా
మహిళల కష్టాలను అర్థం చేసుకునే అవకాశం వారికి కలుగుతుందన్నారు. అనంతరం
జస్టిస్ భానుమతి, జస్టిస్ సుజాత, జస్టిస్ జ్యోతిర్మయితోపాటు
భాస్కరలక్ష్మిని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు
అందజేశారు.