నరసన్నపేట : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిన
నేపథ్యంలో విపక్షాల బుద్ధి ఇకనైనా మారాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం నరసన్నపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో
మాట్లాడారు. అంతకుముందు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు
వేసి నివాళులు అర్పించారు. విశాఖ పెట్టు బడిదారుల సదస్సు విజయవంతం అయినందుకు
బాణాసంచా కాల్చి హర్షాన్ని వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని
పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 352 ఒప్పందాల ద్వారా . రూ.13 లక్షల కోట్లకు
పైగా పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు విశాఖ వేదిక కావడం సంతోషకర
విషయమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉపాధికి ఇది దోహద పడుతుందని అంతే
కాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా మరింత బల పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం
చేశారు.
రాష్ట్ర విభజనతో ప్రధాన నగరమైన హైదరాబాద్ కోల్పోయామాని, ఆ నగరంతో పోటీ
పడగలిగిన స్థాయి ఒక్క విశాఖకు మాత్రమే ఉందనీ అది మన అదృష్టమని తెలిపారు. కొత్త
పరిశ్రమలకు చాలా వేగంగా అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. సులభతర వాణిజ్యం (ఈజ్
ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో గత మూడేళ్లుగా నెంబర్ వన్‌గా ఉన్నామని గుర్తుచేశారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌలిక వసతుల గురించి ప్రచారం
చేయలేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందనీ
భావనపాడు పోర్టు నిర్మాణం కూడా జరుగుతోంది. జెట్టీలు కూడా రాబోతున్నాయి తీరం
వెంబడి పలు ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతుందనీ తద్వారా వలసల నివారణకు ఇవి
పూర్తిగా సహాయపడతాయన్నారు. విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేయడం మానాలి. ఇక్కడి
నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయన్న విమర్శలు వీడాలి..అని హితవుచెప్పారు. దేశం
గర్వపడే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రపంచంలోనే టాప్ టెన్‌లో ధనికులుగా ఉన్న
వారు, సీఎం జగన్ గురించి ఎంత బాగా చెప్పారో చూశామన్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రగతికి బంగారుబాట వేస్తున్న సీఎం జగన్ కు ప్రతి
ఒక్కరూ అండగా నిలిచి ఎంఎల్సీ అభ్యర్ధులు నర్తు రామారావు (స్థానిక సంస్థలు),
సీతంరాజు సుధాకర్ (ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ) విజయానికి కృషిచేయాలని
కృష్ణదాస్ పిలుపునిచ్చారు. రైతుల దగ్గర మిగిలి ఉన్న ధాన్యాన్ని చివరి గింజ
వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేసి తీరుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ
విషయమే తాను ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని ఆయన కూడా
స్పష్టమైన హామీ ఇచ్చారని కృష్ణ దాస్ వివరించారు. విలేకరుల సమావేశంలో
వైయస్సార్సీపి బీసీ సెల్ జోనల్ ఇన్చార్జి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య,
డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళీధర్, వాన గోపి,
పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు పతివాడ గిరీశ్వర రావు, చింతు రామారావు,
చీపురు కృష్ణమూర్తి, రాజాపూ అప్పన్న తదితరులు ఉన్నారు.