వెలగపూడి సచివాలయం : మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందని,
మంగళవారం చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం
తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల
సమావేశమయ్యారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల
ఫెడరేషన్ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు. ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ
నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు
అహ్వానించలేదు. మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత
ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం
ప్రకటన చేయాల్సిందేనని డిమండ్ చేశారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని
ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలని కోరారు. మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా
కొనసాగుతుందని నేతలు తేల్చి చెప్పారు. చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల
నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు
వెంకటేశ్వర్లు తెలిపారు.