విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్
అంబాసిడర్ అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు అన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా
రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే
ఆధ్వర్యంలో మంగళవారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కండ్రికలో జరిగిన ఈ
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ
కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జీఐఎస్ 2023
సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యావత్ దేశం
దృష్టిని మరోసారి ఆకర్షించిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఛరిష్మాతోనే దిగ్గజ కంపెనీలు ప్రత్యేకంగా విశాఖ సమ్మిట్ కు
హాజరయ్యాయని, భారీ పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక
వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా సాగిన
సమ్మిట్ విజయవంతం కావడం సంతోషదాయకమన్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి
పెద్దఎత్తున స్పందన లభించిందని, ప్రభుత్వం మీద, సీఎం జగన్ నాయకత్వం మీద
పారిశ్రామిక వేత్తలు పూర్తి విశ్వాసాన్ని చూపించారన్నారు. కేవలం రెండు
రోజుల్లోనే ఏకంగా రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడులకు 378 ఒప్పందాలు
కుదుర్చుకోవడం పారిశ్రామిక వర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని రుజువు
చేసిందన్నారు. వీటి ద్వారా రానున్న రోజుల్లో 6.09 లక్షల మంది యువతకి ఉపాధి
అవకాశాలు లభించనుండటం సంతోషదాయకమన్నారు. అలాగే ఒప్పందాలు కుదుర్చుకొని
వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చేలా సీఎస్ అధ్యక్షతన ఒప్పందాల
పర్యవేక్షణ కమిటీని వేయడం హర్షణీయమన్నారు.
విశ్వసనీయత ప్రతీకగా సీఎం జగన్ సర్కారు
చంద్రబాబు పాలనలో పారిశ్రామిక అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీదనే జరిగేదని
మల్లాది విష్ణు విమర్శించారు. కానీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా రూ. వేల
కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నట్లు వెల్లడించారు. కోవిద్ కష్టకాలంలోనూ
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా పరుగులు పెట్టించి.. ఏపీలో పెట్టుబడుల
అవకాశాలకు దారులు పరిచారన్నారు. కనుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ వరుసగా
మూడేళ్లు మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని.. 11.43 % జీఎస్డీపీతో
దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహా
పలువురు వ్యాపార దిగ్గజాలు పలు రంగాలలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని
కొనియాడారన్నారు. ‘జె అంటే జగన్ – జె అంటే జోష్’ అంటూ ఇన్వెస్టర్లు
కీర్తిస్తున్నట్లు వెల్లడించారు.