విశాఖపట్నం : సమాజ ప్రగతిలో మహిళలు పాత్ర అత్యంత ప్రశంసనీయమని నగర మేయర్
గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జే. సుభద్ర లు
కొనియాడారు. మంగళవారం ఇక్కడ డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో వైజాగ్
జర్నలిస్ట్ ల ఫోరమ్ కార్యవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా
నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, జడ్పీ చైర్ పర్సన్
సుభద్ర, శాసన మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి. జిసిసి చైర్ పర్సన్ శోభ
స్వాతిరాణి, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ కొండ రమాదేవి , బ్రహ్మ కుమారీస్
ప్రతినిథి బీకే రామేశ్వరిలు పాల్గొని మాట్లాడారు. మహిళలను ఎక్కడైతే
గౌరవిస్తారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారన్న పురాణ ఇతిహాస కథనాన్ని మేయర్ ఈ
సందర్భంగా ప్రస్తావించారు. నింగిలో సగం, నేలపై సగం అన్నట్లు ఇప్పుడు మహిళలు
అన్ని రంగాల్లో కూడా ఎనలేని ఆర్థిక పురోగతి సాధిస్తున్నారని వీరంతా
పేర్కొన్నారు. అదేవిధంగా పురుషులు సహకారం లేనిదే మహిళలు కూడా పూర్తిగా
రాణించలేరని కాబట్టి పరస్పర అవగాహనతోనే వీరు ముందుకు సాగాలన్నారు. నిరంతరం
సమాజాభివృద్ధి కోసం పాటుపడుతున్న వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సేవలను వీరంతా
కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను
బాబు మాట్లాడుతూ ప్రతి ఏట క్రమం తప్పకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవ
వేడుకలను ఒక రోజు ముందుగానే ఘనంగా నిర్వహిస్తున్నా మన్నారు. తమ కార్యవర్గం
హయాంలో మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రతి ఏట వారిని
సత్కరించుకుంటూ వస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు
సాగుతున్నామని తమ పాలకవర్గ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
పూర్తి చేశామన్నారు. కార్యదర్శి దాడి రవికుమార్ మాట్లాడుతూ. కార్యక్రమాన్ని
విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రోగ్రాం కో ఆర్డినేటర్, వైస్
ప్రెసిడెంట్ ఆర్ నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికి మాట్లాడుతూ అన్ని పండు గులతో
పాటు ఇతర సంక్షేమ కార్య క్రమాలు నిర్వహించిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
ప్రింట్, ఎలక్ట్రాని క్ మీడియా రంగాల్లో సేవలందించిన వారితో పాటు ముగ్గులు,
పాటలు పోటీలు లో విజేతలు, అతిథులను కలిపి మొత్తం 32 మంది మహిళలు ను ఘనముగా
సత్కరించారు. కార్యక్రమములో కార్య వర్గ సభ్యులు పి. వరలక్ష్మి, ఇరోతి ఈశ్వర
రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, గయాజ్, శేఖర మంత్రి తదితరులు పాల్గొన్నారు.. తొలుత
స్కూల్ అఫ్ థియేటర్ ఆర్ట్స్ విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక
కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.