అమరావతి : రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ను
సొంతంగా నిర్వహిస్తూ మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత
ఇస్తోంది. దీంతో మహిళలు ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయడంతో పాటు యువతకు ఉపాధి
అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే రాష్ట్రంలో అత్యధికంగా మహిళల
యాజమాన్యంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం అందింది.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా గత మూడేళ్లలో
క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఈ ఆర్థిక సాయం అందించారు. 2020–21 నుంచి
2022–23 నవంబర్ వరకు రాష్ట్రంలో మహిళల యాజమాన్యంలోని 2.21 లక్షలకు పైగా
ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి రూ.1,181.14 కోట్లు అందించినట్లు
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీలో
మినహా గత మూడేళ్లలో మరే రాష్ట్రంలోనూ మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు ఇంత
పెద్ద సంఖ్యలో ఆర్థిక సాయం అందించలేదని తెలిపింది.
ఆర్థిక సాయం ఇలా :
2021–22లో దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 1.30 లక్షల ఎంఎస్ఎంఈలకు
క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందించగా రాష్ట్రంలో అత్యధికంగా
22,641 ఎంఎస్ఎంఈలకు సాయం దక్కింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్
నిలిచాయి. ఇక 2022–23లో నవంబర్ వరకు దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని
2.34 లక్షల ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందగా
రాష్ట్రంలో అత్యధికంగా 1.24 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలకు సాయం లభించింది. ఏపీ
తర్వాత అత్యధికంగా సాయం అందుకున్న రాష్ట్రాల్లో జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్
నిలిచాయని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెరిగిన ఎంఎస్ఎంఈలు
2021–22లో మహిళల యాజమాన్యంలో ఎంఎస్ఎంఈలు 86.11% పెరిగినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ
మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ద్వారా మొత్తం 19,59,778 మందికి ఉపాధి లభించినట్టు
వివరించింది. ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం గత టీడీపీ
ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలను ఇవ్వకుండా పెద్ద ఎత్తున
బకాయిలు పెట్టింది. సుమారు రూ.3,409 కోట్ల మేర టీడీపీ ప్రభుత్వం
చెల్లించకపోవడంతో ఎంఎస్ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ
అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించి ఎంఎస్ఎంఈలను
ఆదుకుంది. అంతేకాకుండా మూడేళ్లుగా ఎంఎస్ఎంఈలకు సకాలంలో రాయితీలను
చెల్లిస్తోంది. గత మూడేళ్లలోనే రూ.1,706.16 కోట్లను రాయితీల కింద రాష్ట్ర
ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసే
పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయిపట్టుకుని నడిపించేలా
వ్యవహరిస్తోంది.