కార్యదర్శి పుష్పవిజయవాడ : అక్రమ రవాణా బాధిత మహిళలు, సెక్స్ వర్కర్లు రాష్ట్రంలో అత్యంత
అట్టడుగున ఉన్న జనాభాలో ఒకరని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వారు
నేరస్తులు గానే పరిగణించడుతూ సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారనీ, వారికి
పునరావాసం, సాధికారత కల్పించడం తో పాటు సమాజంలోని అందరి మహిళల లాగా వీరికి
సమానత్వం కల్పించడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని అక్రమ రవాణా
బాధిత మహిళల రాష్ట్ర ఫోరమ్ విముక్తి అధ్యక్షరాలు అపూర్వ, కార్యదర్శి పుష్ప
ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం
స్థానిక ప్రెస్ క్లబ్ లో విముక్తి, హెల్ప్ సంస్థలు సంయుక్తంగా మీడియా సమావేశం
ఏర్పాటు చేశారు.
విముక్తి అధ్యక్షరాలు అపూర్వ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ‘‘నవరత్నాలు’’
పేరిట అట్టడుగు, బలహీన వర్గాల ప్రజలు, మహిళలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా
వారి ఆర్ధిక అభివృద్ధి సాధికారత కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి
చేస్తున్నారని, కాని మన రాష్ట్రంలో పునరావాసం, నష్ట పరిహారం అందక అక్రమ
రవాణా కు గురైన 1.33 లక్షల మంది మహిళలు, బాలికలు నేటికి వ్యభిచార కూపంలోనే
మగ్గుతున్న వీరి పునరావాసం, సంక్షేమం కోసం 2003లో రూపొందించిన జి.వో నెం:1
పునరుద్ధరించి, సక్రమంగా, పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.
రజని విముక్తి నాయకురాలు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని
సెక్స్ వర్కర్లు సాధారణ జనాభాకు అందుబాటులో ఉన్న ఆర్థిక సహకారం, పథకాల నుండి
మినహాయించబడ్డారు. వారు తమ ఆదాయాన్ని పొదుపు చేసుకోలేక, కాపాడుకోలేక, ఆర్థిక
సంస్థల నుంచి అప్పులు తీసుకోలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలు
వసూలు చేస్తూ నిత్యం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వారు ఇతర జీవనోపాధిని
కనుగొనలేక వ్యభిచారం మరియు సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడవలసి వస్తుంది. అయితే
కేవలం హై రిస్క్ గ్రూప్‌గా గుర్తించబడినందున సాధారణ జనాభాకు హెచ్ఐవి వ్యాప్తి
చెందకుండా నిరోధించడం కోసం మాత్రమే ప్రభుత్వ దృష్టి సెక్స్ వర్కర్ల వైపు
మళ్లింది.
సెక్స్ వర్కర్ల పొదుపు సంఘాలు, బ్యాంకుల మధ్య సంబంధాలను సులభతరం చేయడంలో
సహాయపడే వ్యవస్థ ఏర్పాటు చేసి సెక్స్ వర్కర్ల జీవనోపాధిలో వైవిధ్యాన్ని
పెంచడానికి, ఒక వ్యూహాన్ని రూపొందించడానికి, సెక్స్ వర్కర్ల జీవనోపాధిపై
దృష్టి పెట్టాలని రాష్ట్ర గ్రామీణ జీవనోపాధుల మిషన్, రాష్ట్ర పట్టణ ప్రాంత
జీవనోపాధుల మిషన్ లను ఆదేశించాలని దీనిపై ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు
చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విముక్తి ఉపాధ్యక్షరాలు
కె.జ్యోతి, లావణ్య, మౌనిక, హెల్ప్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ భాస్కర్ రావు,
నితిన్, లలిత పాల్గొన్నారు.