విజయవాడ : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకర్షణీయమైన గమ్యస్థానమని,
రెండు రోజుల క్రితం విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ సమ్మిట్ లో
పలు పారిశ్రామిక దిగ్గజ సంస్థలు 13.41 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు
ముందుకు వచ్చాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి
రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు.
పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు రాష్ట్రంలో
యువతకు 6 లక్షల పైగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. రికార్డు స్థాయిలో జరిగిన
378 ఒప్పందాలు రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు.
సమ్మిట్ లో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు
స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని అన్నారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి పరిశ్రమల
స్థాపనకు అవసరమయ్యే సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.
ఉన్నత శిఖరాలకు చేరుకోనున్న రాష్ట్ర అభివృద్ధి
విశాఖ జీఐఎస్-2023 తో రాష్ట్ర స్వరూపమే మారనుందని విజయసాయి రెడ్డి అన్నారు.
అభివృద్దిలో రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరుకోనుందని అన్నారు. విశాఖ జీఐఎస్ ఘన
విజయం సాధించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారద్యంలో రాష్ట్రం
అభివృద్ధిలో దూసుకుపోనుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని ఆయన అన్నారు.