విశాఖపట్నం : వైజాగ్లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఏపీ పారిశ్రామిక వృద్ధిలో రోడ్
కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం
చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని
పేర్కొన్నారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు రూ.20వేల కోట్లు కేటాయిస్తామని
గడ్కరీ తెలిపారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని గడ్కరీ
పేర్కొన్నారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు
సిద్ధమని ప్రకటించారు. 50-50 భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు
చేస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని
చెప్పారు. ఈ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోందని వివరించారు. పర్యావరణహిత
వాహనాలదే భవిష్యత్ అని స్పష్టంచేశారు. కాలుష్యాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని
సూచించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు.
కేంద్రం నుంచి ఏపీకీ సంపూర్ణ సహకారం ఉంటుందని గడ్కరీ చెప్పారు. దేశంలోని ముఖ్య
రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం
అందిస్తామన్నారు. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.