విజయవాడ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. జనవరి 28న గుండెపోటుతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చేరిన ఆయన నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని విజయవాడ రమేశ్ ఆసుపత్రి నుంచి మచిలీపట్నంలోని స్వగృహానికి తరలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు పీఏసీఎస్ అధ్యక్షుడిగా, 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
బచ్చుల అర్జునుడు రాజకీయ ప్రస్థానం ఇదే : శాసన మండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత బచ్చుల అర్జునుడు గురువారం మృతిచెందారు. ఆయనకు జనవరి 28వ తేదీన గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మచిలీపట్నం బందరుకోటలో 1957 జూలై నాలుగున సుబ్బయ్య, అచ్చమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లలో అర్జునుడు ఆరోవాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 1995నుంచి 2000వరకు బందరుకోట పీఎసీఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కేడీసీసీబీ వైస్‌చైర్మన్‌గా వ్యవహరించారు. టీడీపీ తరపున 2000 సంవత్సరం నుంచి 2005 వరకు మచిలీపట్నం మునిసిపల్ చైర్మన్ గా పనిచేశారు. 2014 నుంచి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2017లో శాసనసభ్యుల కోటాలో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా కొనసాగుతూనే 2020వ సంవత్సరం వరకు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2020లో టీడీపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను పరామర్శించారు. అర్జునుడు మృతికి పార్టీ నాయకులు దిగ్ర్భాంతి చెందారు.