విజయవాడ : హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్ పోర్ట్ అకాడమీలో ‘అఖిల భారత
ప్రజా రవాణా సంస్థల టోర్నమెంట్-2023′ గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల
పాటు జరిగే ఈ టోర్నమెంట్ ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తో కలిసి
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ప్రారంభించారు. అనంతరం మహారాష్ట్ర
ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ జట్ల మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ ని వీక్షించారు.
అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు,
మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్
ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) కబడ్డీ టోర్నమెంట్‌ను
నిర్వహించడం అభినందనీయమన్నారు.
”ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావ సేవలు అందిస్తున్నారు. మంచి
ఆహారపు అలవాట్లను ఏర్పరచుకోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే
అవకాశాలు లేకపోలేదు. కావున, ఆర్టీసీ ఉద్యోగులు రోజువారీ జీవన విధానాన్ని
మరింత మెరుగుపరుచుకోవాలి. ఆరోగ్యం కోసం యోగా, మెడిటేషన్ చేయాలి. పుస్తకాలను
చదవాలని ద్వారక తిరుమల రావు సూచించారు. ఆలోచన విధానం మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా
బాగుంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. క్రీడల్లో గెలుపు ముఖ్యం
కాదు. పోటీల్లో ప్రతి క్రీడాకారుడు తమ సామర్థ్యం మేరకు ఉత్తమ ఫలితం కోసం
ఆరాటపడాలి. ఆటను ఎంజాయ్ చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రయాణం అనేది
చాలా ముఖ్యంఅని ఆయన అన్నారు.
టీఎస్ఆర్టీసీకి ఉన్న హకీంపేట ట్రాన్స్ పోర్ట్ అకాడమీ లాంటి సదుపాయాలు దేశంలోని
ఏ ఇతర ఆర్టీసీలకు లేవని కితాబిచ్చారు. ఈ కబడ్డీ టోర్నమెంట్‌కు టీఎస్ఆర్టీసీ
ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ప్రారంభానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిందకు
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్కి ధన్యవాదాలు తెలిపారు. క్రీడల్లో అందరూ
గెలుపు ముఖ్యం అనుకుంటారు. పాల్గొనడం కూడా గెలుపే. క్రీడల్లో గెలుపు, ఓటములను
సమానంగా చూడాలి. క్రీడల వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ కబడ్డీ టోర్నమెంట్లో తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై,
బృహణ్ ముంబై, పుణే మహానగర్ పరివాహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ప్రజా రవాణా
సంస్థలు పాల్గొంటున్నాయని, ఆయా టీమ్ లకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తరపున
స్వాగతం పలుకుతున్నామన్నారు.
”కబడ్డీ మంచి వ్యాయామ క్రీడ. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆటకు మంచి క్రేజ్
ఉంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే వారు క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలి. విధి
నిర్వహణలోనూ ఇదే రకమైన స్పూర్తిని కొనసాగించాలని సజ్జనర్ ఆకాంక్షించారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని, దానికి
టీఎస్ఆర్టీసీ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో ఏఎస్ఆర్టీయూ ఏ
కార్యక్రమం చేపట్టిన ఆతిథ్యం ఇవ్వడానికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిద్ధంగా
ఉందని తెలిపారు.