విజయవాడ : దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ డ్రైవ్ ను
యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత
సదనములో మలేరియా అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ
సందర్భంగా హై రిస్క్ ప్రాంతాలపై ఆరా తీశారు. మలేరియా – 3, 4, 6 ప్రాంతాలలో
పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని, ఫాగింగ్ ఆటోలు, హ్యాండ్ స్ప్రేయింగ్
యంత్రాలని పెంచుకోవాలన్నారు. దోమలు వృద్ధి కేంద్రాలను ఎప్పటికప్పుడు
గుర్తించి.. లార్వా దశలోనే నియంత్రించడంపై దృష్టిసారించాలన్నారు. మురికి
కుంటలు, కాలువలలో గుర్రపుడెక్కను తొలగిస్తూ రసాయనాలను పిచికారి చేయాలన్నారు.
కాలువలు, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల వృద్ధికై నియంత్రణ చర్యలు
చేపట్టాలన్నారు. పగలు రాత్రి రెండు పూట్ల ఫాగింగ్ ప్రక్రియను కొనసాగించాలని
ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు క్లీన్
ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యత గురించి ప్రచారం
నిర్వహించాలని తెలిపారు. అలాగే మలేరియా సిబ్బందికి, సచివాలయ కార్యదర్శులకు
మధ్య సమన్వయం తప్పనిసరి అని సూచించారు. సమీక్షలో బయాలజిస్ట్ సూర్య నాయక్,
మలేరియా ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.