విజయవాడ : విశాఖలో ఈ నెల 3,4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్
సమ్మిట్-2023 లో అడుగడుగునా రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా రాష్ట్ర
ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా బుధవారం పలు
అంశాలను ఆయన వెల్లడించారు. బ్యాడ్జీలు దగ్గర నుంచి కిట్లు వరకు రాష్ట్ర
సంస్కృతి దర్శనమిచ్చేలా డిజైన్ చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
కనబరిచిందని అన్నారు. అతిధులకు ఇచ్చే గిఫ్ట్ బాక్స్ లపై పెడన కలంకారీ డిజైన్,
ముఖ్య అతిథులకు సిల్వర్ ఫలిగ్రీతో చేసిన జీఐఎస్ లోగో తో ఉన్న బహుమతులు
అందించనున్నారని అన్నారు.
రానున్నవి పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలు
రానున్నవి పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగనున్న ఎన్నికలని విజయసాయి రెడ్డి
అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం
గురించి ప్రజలకు వివరించి ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యముందా అని ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ప్రతిపక్షాలు స్వీకరించగలవా అని
ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రైతు (ఆర్) అంతర్భాగం
వైఎస్సార్ (యువజన శ్రామిక రైతు) కాంగ్రెస్ పార్టీ పేరులోనే రైతు ఉందని, తమది
రైతు సంక్షేమ ప్రభుత్వమని విజయసాయి రెడ్డి అన్నారు. రైతులకు వెన్నుదన్నుగా
నిలుస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి 13500 రూపాయలు ఆర్థిక సహకారం
అందిస్తోందని అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో రైతులకు 27,062
కోట్లు అందించిందని, ఈ లెక్కన ప్రతి రైతు కుటుంబానికి 54000 ఆర్థిక సహకారం
అందిందని అన్నారు. కేంద్రం రైతులకు 6000 రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తుండగా
దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 7500 కలిపి రైతులకు అందిస్తోందని ఆయన
అన్నారు.
నేషనల్ డిజిటల్ లైబ్రరీ ప్రతిపాదన అభినందనీయం
దేశ వ్యాప్తంగా పిల్లలు, యువకులకు ఉపయోగపడేలా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు
చేయాలన్న ప్రతిపాదన అభినందనీయమని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. డిజిటల్
లైబ్రరీ ఏర్పాటు చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా విద్యా రంగంలో విప్లవాత్మక
మార్పు రానుందని అన్నారు. అన్ని సబ్జెక్టులకు చెందిన ముఖ్యమైన పుస్తకాలు అన్ని
ప్రాంతాలకు చెందిన విద్యార్దులకు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.