అమరావతి : పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని
చేస్తున్న ఉద్యోగులు ఏళ్ల తరబడిగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను రాష్ట్ర సాంఘిక
సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పరిష్కరించారు. ఇకపై వారి వేతనాలు సకాలంలో
అందుకొనేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కాస్) కు వారి సేవలను అనుసంధానం
చేసారు. ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్లే రాష్ట్రంలో ఉన్న 160 పోస్ట్ మెట్రిక్
ఎస్సీ హాస్టళ్లలో వంటపని, పారిశుద్ధ్యం ఉద్యోగులు గా పని చేస్తున్న వారిలో 411
మందికి ప్రైవేటు సంస్థల ద్వారా వేతనాలను చెల్లించేవారు. అయితే ఈ విధానంలో ఆ
ఉద్యోగులకు వేతనాలు అందడం ఆలస్యమౌతుండటంతో ఉద్యోగులు విధుల నుంచి తప్పుకొని
వెళ్లిపోవడం, ఈ కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకావడం జరుగుతుండేది.
అందుకే తమ వేతనాలు అందరితో పాటుగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆ
ఉద్యోగులు అధికారులు, గతంలో ఉన్న మంత్రులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా
పోయింది. ఈ పరిస్థితుల్లోనే ఉద్యోగుల సమస్య మంత్రి మేరుగు నాగార్జున దృష్టికి
రావడంతో ఈ సమస్యలను శాశ్వితంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని
అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం థర్డ్ పార్టీ విధానంలో పని
చేస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రీ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకే మంజూరైన
పోస్టుల స్థానంలో ఉపయోగించుకోవాలని, వారి వేతనాలను ఆప్కాస్ ద్వారా ఆలస్యం
లేకుండా ప్రతినెలా అందరితో పాటుగా చెల్లించాలని అధికారులు ప్రతిపాదించగా
మంత్రి మేరుగు నాగార్జున చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ
ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసారు. దీంతో ఈ ఉద్యోగులు ఇప్పటి వరకూ వేతనాల కోసం
పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. అదే విధంగా పోస్ట్ మెట్రిక్
హాస్టళ్లలో ఉద్యోగులు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడే దుస్థితికి కూడా
తెరపడింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దమనసుతో ఉద్యోగుల కష్టాలు
అర్థం చేసుకోవడం వల్లే ఈ సమస్య పరిష్కరం అయిందని మంత్రి మేరుగు నాగార్జున
చెప్పారు. ఈ సందర్భంగానే ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఆప్కాస్ కు అనుసంధానం చేసిన ఈ 411 మంది పోస్ట్ మెట్రిక్ ఎస్సీ
హాస్టల్ ఉద్యోగులలో 37 మందిని శ్రీకాకుళం, 52 మందిని విజయనగరం, 17 మందిని
విశాఖపట్నం, 120 మందిని తూర్పుగోదావరి, 82 మందిని కృష్ణా,62 మందిని ప్రకాశం,
41 మందిని అనంతపురం జిల్లాలకు చెందిన హాస్టళ్లకు కేటాయిస్తూ సాంఘిక సంక్షేమ
అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. కాగా తమ సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపిన
మంత్రి మేరుగు నాగార్జునకు, తమ కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డికి ఈ సందర్బంగా ఉద్యోగులు తమ ధన్యవాదాలు తెలిపారు.