విశాఖపట్టణం : మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్టణం వేదికగా నిర్వహించే
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను సమష్టి కృషి విజయవంతం చేయాలని,
ఎలాంటి సమన్వయం లోపం లేకుండా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవన్ అధికారులను ఆదేశించారు. ప్రపంచం
నలుమూలల నుంచి విచ్చేస్తున్న పెట్టుబడిదారులు, అతిథుల మనస్సు గెలిచేలా
ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని సూచించారు. మర్యాద పూర్వకమైన
ప్రవర్తనతో వారిని స్వాగతించాలని, వేదికలను చూపించటంలో వారికి
సహకరించాలని చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికా
ప్రకారం వ్యవహరించాలని సూచించారు. కమిటీలకు అప్పగించిన బాధ్యతలను
విజయవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్
సమ్మిట్ నిర్వహణకు సంబంధించి జరిగిన ఏర్పాట్లు, తీసుకున్న చర్యలపై
కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంగళవారం
సాయంత్రం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా కరికాల
వల్లవన్ మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులు పది కాలాల
పాటు గుర్తు పెట్టుకొనేలా ఏర్పాట్లు చేయాలని, వారికి అన్ని విధాలా సహాయ
సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన
బాధ్యతలను ప్రాథమిక కర్తవ్యంగా భావించి పని చేయాలని హితవు పలికారు.
సదస్సు నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలు బాగానే రూపొందించారని, వాటిని
ఆచరణలో కూడా బాగా అమలు చేయాలని సూచించారు. ఈ సదస్సు మన దేశానికి,
రాష్ట్రానికి, మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఈ
సందర్భంగా పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ
సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన సమ్మిట్లు
ప్రయివేటు పార్టనర్ షిప్‌తో జరిగేవవని, ఇప్పుడు జరుగుతున్న ఈ సదస్సు
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో జరుగుతోందని గుర్తు చేశారు.
కమిటీలు, నోడల్ అధికారులను నియమించాం
సమావేశంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున సదస్సుకు
సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఏర్పాట్ల గురించి
వివరించారు. రిజస్ట్రేషన్ ప్రక్రియ నుంచి సదస్సు ముగిసే వరకు
చేపట్టాల్సిన ప్రక్రియల గురించి సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్
చేశారు. మెయిన్ సమావేశ మందిరం, ముఖ్యమంత్రికి కేటాయించిన సభా స్థలం,
స్టాళ్లు ఇతర వసతుల గురించి సమావేశంలో ప్రస్తావించారు. వీఐపీలు బస
చేసేందుకు హోటల్స్‌లో ఏర్పాట్లు చేశామని, సభా ప్రాంగణంలో వారి వాహనాలు
నిలిపేందుకు, ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కోసం ప్రత్యేక పార్కింగ్
సదుపాయం కల్పించామని చెప్పారు. టైమ్స్ నెట్ వర్కు, ఇతర ఈవెంట్ మేనేజ్
మెంట్లు వారి చేయాల్సిన పనుల గురించి, నోడల్ ఆఫీసర్లు వారికి అప్పగించిన
బాధ్యతల గురించి వివరాలు వెల్లడించారు. సుమారు నాలుగు వేల మందికి
భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నామని, అతిథులను హోటళ్ల నుంచి వేదిక
వద్దకు తీసుకొచ్చే విధంగా ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ప్రతి
హోటల్ వద్దా, ప్రధాన వేదిక వద్దా వైద్య బృందాలను అందుబాటులో
ఉంచుతున్నామని పేర్కొన్నారు.