విజయవాడ : గ్రామ రెవెన్యూ సహాయకులను పదోన్నతి ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి. ఎస్ దివాకర్ కోరారు. అలాగే
వీఆర్ఏలు, పార్ట్ టైం ఉద్యోగులకు ఫేస్ యాప్ నుండి మినహాయింపు ఇవ్వాలని
విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో
మంగళవారం అడిషనల్ సి సి ఎల్ ఏ ఇంతియాజ్ ని కలిసి వివిధ సమస్యల వినతిపత్రం
అందించారు. దీనిపై అడిషనల్ సీసీఎల్ఏ సానుకూలంగా స్పందించారు. వీఆర్ఏలు పార్ట్
టైం ఉద్యోగులు, అనునిత్యం రీ సర్వే , ఇతర పనులు విషయమై ఫీల్డ్ లో
ఉంటున్నందున, ఫేస్ యాప్ నుండి మినహాయింపు ఇవ్వాలని, డి ఎ మంజూరు చేయాలని
కోరారు. గ్రామ రెవెన్యూ అధికారుల ఖాళీ పోస్టులలో, వన్ టైం సెటిల్మెంట్ గా
గ్రామ రెవెన్యూ సహాయకులకు పదోన్నతి ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వి.ఎస్ దివాకర్,
గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి ధైర్యం, ప్రధాన కార్యదర్శి
కే సత్యరాజు , ఏ వెంకటరమణ, పి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.