విజయవాడ : ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి
విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ అన్నారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్
రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో
రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం
ప్రారంభించారు.
మేధావులు, విద్యావేత్తలు అయిన సి.వి.రామన్, అబ్దుల్ కలాం, రామానుజన్ జీవితాలను
ప్రతి ఒక్క విద్యార్ధి ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులంతా
తమ దైనందిన కార్యక్రమాల్లో సైన్సుకు సంబంధించిన అంశాలను గుర్తించి వాటిపై
పరిశోధనలు చేసే స్థాయికి రావాలన్నారు. ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా
వెనకాడకుండా విద్యార్థుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని, అమ్మఒడి, జగనన్న
గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన వంటి పథకాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
విద్యా రంగంలో చేస్తున్న మార్పుల వల్ల విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా
విద్యార్థులకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. రానున్న
రోజుల్లో ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసి, గెస్ట్ లెక్చర్స్
ఇస్తారని ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పాఠశాల విద్యా శాఖ కమిషనర్, సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్
కుమార్ మాట్లాడుతూ మాజంలో అభివృద్ధి ఒక ఆలోచన నుంచే పుడుతుందన్నారు.
విద్యార్ధుల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి
సైన్స్ ఫెయిర్ నిర్వహణ ఉపయోగపడుతుందన్నారు. పాఠశాల స్ధాయి నుంచి మండల, జిల్లా
స్ధాయి వరకు సైన్స్ ఫెయిర్లు ఏర్పాటు చేశామని, జిల్లా స్థాయిలో పది చొప్పున
సైన్స్ ప్రదర్శలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. నవంబర్ లో
నిర్వహించిన పాఠశాల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో మొత్తం 85వేల మంది పాఠశాల
విద్యార్థులు పాల్గొనగా డిసెంబర్ లో నిర్వహించిన మండల స్థాయి సైన్స్
ఎగ్జిబిషన్ లో 17,500 మంది చిన్నారులు పార్టిసిపేట్ చేశారన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు మాట్లాడుతూ జాతీయ విజ్ఞాన
దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయి
సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు
అన్నారు. 26 జిల్లాల నుంచి 5 అంశాలపై చేసిన 260 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి
సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించడం సంతోషకరమన్నారు. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్,
ఆరోగ్యం, సాఫ్ట్ వేర్, పర్యావరణం, గణితం వంటి అంశాలపై ప్రాజెక్టుల ప్రదర్శన
జరుగుతుందన్నారు. వీటిలో ఎంపికైన వాటిని జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపిక
చేస్తామన్నారు. మిగిలిన 245 ప్రాజెక్టుల విద్యార్థులు నిరుత్సాహ పడవద్దని,
శాస్త్రీయ దృక్పథాన్ని మరింత అలవర్చుకుని నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు.