అమరావతి : మెడికో ప్రీతి తుదిశ్వాస విడవడం ఎంతో బాధాకరమని ఆమె ఆత్మకు శాంతి
చేకూరాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. ర్యాగింగ్
చేస్తున్న వారితో పాటు వాళ్లకు సహకరిస్తున్న వాళ్లను ఉరి శిక్ష వేయాలని దుండ్ర
కుమారస్వామి డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద చదువులు చదువుతూ తమ ఈగోలను శాటిస్ఫై
చేసుకోడానికి ర్యాగింగ్ చేస్తూ ఉన్న సీనియర్ విద్యార్థులను బహిరంగంగా చంపినా
తప్పు లేదని దుండ్ర కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ప్రీతి కుటుంబ సభ్యుల రోదనలు
చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోందని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. ఐదు
రోజులుగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి
ఆదివారం రాత్రి కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తిచేసి
ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి
గిర్నితండాకి తరలించారు. రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతి పెచ్చు
మీరుతోందని కుమారస్వామి అన్నారు. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని
డిమాండ్ చేశారు. వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్ సాధారణమని చెప్పిన
అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని కోరారు. ర్యాగింగ్ చేస్తున్నారని ప్రీతి
ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని దుండ్ర
కుమారస్వామి అన్నారు. ప్రీతి మరణం వెనుక కుట్ర కోణం ఉందని ఆమె తండ్రి
ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సమగ్ర
విచారణ జరిపి నిందితులకు ఉరి శిక్ష విధించాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్
చేశారు. తమ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు చివరికి
నిరాశ మిగిలిందని దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి పేదలకు
మంచి చేయాలనే ఆశయంతో ఉండేదని, ఆమెతో పాటు ఆమె ఆశయం కూడా చనిపోయిందని దుండ్ర
కుమారస్వామి అన్నారు. ప్రీతి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని
దుండ్ర కుమారస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డిపి చారి, విష్ణు
జితేందర్, ఇతరులు పాల్గొన్నారు.