గుంటూరు : అక్షరమే మనిషి జన్మకు పరమావధి.. అక్షరాన్ని ప్రేమించే వాడు
ప్రపంచాన్నీ ప్రేమిస్తాడని అన్నారు బాపట్ల జిల్లా డియస్పీ గోలి లక్ష్మయ్య.
నవ్యాంధ్ర రచయితల సంఘం-పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో ‘కవిమిత్రుల కలయిక-కవి
సమ్మేళనం-పుస్తక సమీక్ష’ కార్యక్రమం ఆదివారం ఉదయం బ్రాడీపేట ఎస్వెచ్వో హాలులో
జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ-
పుస్తకం మానసిక వికాసానికి అద్భుతమైన ఐకాన్ అన్నారు. నిద్ర రహిత జీవితం
గడిపేవాళ్ళు ట్యాబు లెట్స్ కు బానిసలుగా మారాల్సిన అవసరంలేదన్నారు. ఒక చక్కని
పుస్తకం చదివి పడుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన నిద్రను మనసారా ఆస్వాదించవచ్చన్నారు.
ప్రత్యేక అతిధిగా హాజరైన అరసం పల్నాడుజిల్లా కన్వీనర్ కోసూరి రవికుమార్
మాట్లాడుతూ- పల్లెవీధుల్లో కవి సమ్మేళనాలు పెట్టి సాహిత్యాన్ని గ్రామవీధుల్లో
పరిమళింపజేయాలన్నారు. కొత్త తరానికి ఊపిరిపోసే నిర్మాణాత్మక బాధ్యతను మనం
నెత్తికెత్తుకోకపోతే రేపటితరం మోడుగా మిగిలిపోతుందన్నారు. మొగ్గలుగా
వికసిస్తున్న పిల్లల మనసుల్లో సాహిత్యాన్ని రంగరిస్తే వారు పువ్వులు మారి
మానవత్వాన్ని పరిమళింపజేస్తారన్నారు. యేమినేని వెంకటరమణ మాట్లాడుతూ- ఈ తరానికి
పుస్తకాల్ని చదివే అలవాటును నేర్పిస్తే అది మూడు తరాలవరకూ వ్యాపిస్తుందని,
తద్వారా పుస్తకాలు సజీవంగా వుంటాయని అన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన
కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ-మంచి పుస్తకాలు మనిషి ఎదుగుదలకు తప్పక దోహదం
చేస్తాయని, అందుకే నవ్యాంధ్ర రచయితల సంఘం జ్ఞాపికలుగా పుస్తకాలనే
అందిస్తుందన్నారు. ఈ సభలో డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు రచించిన జాతీయ
కవిచక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు పుస్తకాన్ని డాక్టర్ పీ..వి.సుబ్బారావు
సమీక్షించారు. డాక్టర్ యల్లాప్రగడ మల్లికర్ణున రావు మాట్లాడుతూ- మూడు
దశాబ్దాలపాటు కృషి చేసి ఎంతో చారిత్రాత్మక విషయాల్ని ఈ గ్రంథంలో
పొందుపరిచానన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరుజిల్లా అధికార ప్రతినిధి
బండికల్లు జమదగ్ని సభాధ్యక్షత వహించిన ఈ సభలో సీనియర్ జర్నలిస్టు కుర్రా
సురేష్ బాబు పాల్గొన్నారు. కాకరపర్తి సుబ్రహ్మణ్యం కవిసమ్మేళనం నిర్వహించారు.
గోలి విజయ, డి. అనిల్ కుమార్ , తాటికోల పద్మావతి, రేపల్లె రాజ్ కృష్ణ,
కారంచేటి విజయ్‌కుమార్, విష్ణుమొలకల భీమేశ్వరప్రసాద్, ఆళ్ళ నాగేశ్వరరావు,
జయశ్రీ, బి.జనార్థనరెడ్డి, ఎస్.మల్లికార్జునరాయశర్మ, సునీత తదితర కవులు
పాల్గొన్నారు. కోసూరి రవికుమార్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సునీత దుర్గం
చదివిన కవిత ఉత్తమ కవితగా ఎంపికైంది. ఈ కవయిత్రికి డాక్టర్ సేవాకుమార్ చేతుల
మీదుగా నగదు బహుమతి అందజేశారు నిర్వాహకులు. కార్యక్రమాన్ని గుంటూరుజిల్లా
కార్యదర్శి సయ్యద్ జానీబాష, చొప్పా రాఘవేంద్రశేఖర్ నిర్వహించారు.