తిరుమల : తిరుమలలో టిటిడి ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర ప్రాథమిక, ఉన్నత పాఠశాల శనివారం సాయంత్రం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సులోచనా దేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయు) కుదుర్చుకుంది. తిరుమలలోని బంగ్లాలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి సమక్షంలో దేవస్థానం విద్యాసంస్థల తరఫున డిఇవో డా. భాస్కర్ రెడ్డి, సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ గౌరవ కార్యదర్శి అరుణ్ మహేష్ అగర్వాల్‌తో పాటు సింఘానియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ రేవతి శ్రీనివాసన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యా ప్రమాణాలు పెరిగి భారతదేశంలోని ఉన్నతమైన పాఠశాలగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ లెర్నింగ్, బోధనా పద్ధతులు, విశ్లేషణా సామర్థ్యం తదితర అంశాల్లో ఉపాధ్యాయులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా విద్య నాణ్యతను మెరుగుపరచాలని సింఘానియా ఎడ్యుకేషన్ గ్రూప్ ప్రతినిధులను ఆయన కోరారు.
అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, విద్యా బోధనాంశాలపై దృష్టి పెట్టాలని, తద్వారా దేశంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. శిక్షణ పొందిన అధ్యాపకులతో గుణాత్మక విద్యను అందించేందుకు తమవంతు కృషి చేస్తామని సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. లక్ష మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే రేమాండ్ గ్రూప్ సిఎండి గౌతమ్ సింఘానియా జీవిత ఆశయమని, ఇందులో భాగంగా టిటిడితో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, విద్యా విభాగం ఏఈవో ఈశ్వరయ్య, సీనియర్ అసిస్టెంట్ మమత పాల్గొన్నారు.